తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా కారణంగా తిరుపతి వాసులకే సర్వదర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శన టికెట్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి ప్రకటించారు. టోకెన్ల జారీ కేంద్రాలను ధర్మారెడ్డి శనివారం పరిశీలించారు. 


Also Read: పట్టుమని పదకొండేళ్లు లేవు.. కానీ ప్రపంచ రికార్డులు సొంతం చేసుకొన్నాడు


తిరుపతి వాసులకు 50 వేల టికెట్లు


వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లె, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో టోకెన్ల కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి వాసులనే అనుమతిస్తామన్నారు. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. టికెట్ల కోసం వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. టికెట్లు పొందిన భక్తులను ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం నుంచి దర్శనానికి అనుమతిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. 


Also Read:  కర్నూలు నగరంలో శుక్రవారం ఆటో ప్రయాణం ఫ్రీ.. ప్రశంసలు అందుకుంటున్న ఖాదర్ ప్రయత్నం


సిఫార్సు లేఖలకు అనుమతి లేదు 


వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖలు అనుమతించమని టీటీడీ ప్రకటించింది. ఈ రోజుల్లో స్వయంగా వ‌చ్చే ప్రముఖుల‌కు మాత్రమే వీఐపీ బ్రేక్ ద‌ర్శనం క‌ల్పిస్తామని వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్పనిస‌రిగా తీసుకురావాల‌ని కోరింది. మరో వైపు జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల ఆడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను కూడా టీటీడీ ఇప్పటికే రద్దు చేసింది. శ్రీ‌వారి ద‌ర్శనానికి వచ్చే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి ప్రధాన్యం ఇస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని నిర్ణయించింది. జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని వెల్లడించింది. 


Also Read:  గోదారోళ్లా మజాకా... రూ.3.6 లక్షలు పలికిన పందెం పుంజు.... ఈసారి తగ్గేదేలే అంటున్న పందెంరాయుళ్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి