జనవరి ఐదో తేదీ నుంచి ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో జరిపిన సోదాల్లో దాదాపుగా రూ. 800 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. రూ. కోటి అరవై లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్దగా పబ్లిసిటీ చేసుకోకపోయినప్పటికీ భారీ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు మూడు రోజుల పాటు కొనసాగాయి. కొద్ది రోజుల క్రితం.. ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైన ఓ ఐటీ కంపెనీపై దాడి చేసి దాదాపుగా రూ. డెభ్బై కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలపైనా ఐటీ దాడులు చేశారు.
Also Read: రైతులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగిచ్చేయండి
హైదరాబాద్‌తో పాటు అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుల్లో కూడా ఈ కంపెనీలకు సంబంధించిన ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఈ కంపెనీలన్నీ విల్లాలు.. భారీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో విల్లాలు నిర్మిస్తున్నారు. టౌన్ షిప్‌లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. కానీ భారీ ప్రచారానికి దూరంగా ఉంటాయి. పెట్టుబడులకు మాత్రం లోటు ఉండదు. వీటిలోకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయన్నదానిపై ఐటీ అధికారులు కూపీ లాగినట్లుగా తెలుస్తోంది.
Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
ఆయా సంస్థలు ఇప్పటి వరకూ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాయి.. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి.. లావాదేవీల సొమ్ము ఎలా మారకం అవుతుంది లాంటి అంశాలను ఐటీ అధికారులు వెలికి తీశారు. సాధారణంగా ఐటీ కంపెనీ సోదాలు చేసిన కంపెనీల పేర్లను ఎప్పుడూ వెల్లడించదు. నాలుగు రోజుల క్రితం నవ్య డెలవపర్స్, రాగమయూరి బిల్డర్స్ వంటి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దీంతో ఈ కంపెనీలకు చెందిన వివరాలేనని భావిస్తున్నారు.
Also Read: పిల్లాడిపై ఆ కోతులకు ఎందుకు పగ.. ఇంట్లో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లాయి.. అంతకుముందు ఇలానే..
మరో వైపు కేరళలో జరిగిన సోదాల్లో అక్కడి కంపెనీలో లెక్కల్లేని రెండు కోట్ల ముఫ్పై లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ శాఖ మరో ప్రకటనలోతెలిపింది. ఆ కంపెనీ రూ. రెండు వందల కోట్ల వరకూ లెక్కలు లేని లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామని తెలిపింది.