Watch: తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గులాబ్ తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు
గులాబ్ తుపాను త్రీవ వాయుగుండంగా మారిన వేళ తెలంగాణపై దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. తెలంగాణ మీదుగా తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో పడతాయని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
తెలంగాణలో 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.