Elgandal Fort Mystery | వరంగల్ ఖిలా నుంచి ఎల్గందల కోట సొరంగాలు ఉండేవా.? | ABP Desam
ఎల్గందల్ కోట. ఒకప్పుడు బహుధాన్యాపురం అని పిలిచేవారు. ఆ తర్వాత తెల్లకందుల, వెలిగందుల అని ఈ ప్రాంతం పేరు మారింది. కాల క్రమేణా వెలిగందులనే ఎల్గందల్ గా మారింది. ఇక్కడ కొండపైన నిర్మించిన ఈ కోట ఐదు రాజవంశాల పాలనను చూసింది.కరీంనగర్ నుంచి పదికిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల వెళ్లే రోడ్డులో ఉండే ఎల్గందుల్ కోట కాకతీయ రాజవంశం, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘల్ ఇంకా అసఫ్ జాహీల ఏలుబడిలో ఉండేది. ఆయా రాజవంశాలు ఎల్గందల్ కోటను అధికార కేంద్రంగా భావించేవారు. హైదరాబాద్ నిజాంల పాలనలో ఈ కోట కరీంనగర్ ప్రధాన కార్యాలయంగా నియమించబడింది. అందుకే ఇది తెలంగాణలో ఉన్న ప్రధానమైన కోటల్లో ఒకటిగా పేరు సంపాదించింది.ఎల్గందల్ కోట చూడటాికి 300 మెట్లు ఎక్కాలి. మొత్తం రాతితో కట్టి ఉండే ఈ మెట్లు మనల్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి అనుభూతికి మనల్ని తీసుకువెళ్లిపోతాయి. కోటకి ఉన్న తూర్పు ద్వారం, బృందావన్ చెరువు, దో మినార్ మసీదు, ఆంజనేయ స్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి, నరసింహస్వామి ఆలయం..కోటలోని సమాధులను చూసేందుకు పర్యాటకులు బాగానే వస్తుంటారు.