Exclusive: దళిత బంధు నగదును ఆర్థిక క్రమశిక్షణతో వినియోగించుకోవాలి : డిక్కీ ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళిత బంధు పథకంపై రాష్ట్రమంతా ఉత్కంఠగా వేచిచూస్తుంది. ఈ పథకం అమలుకు జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించిన ప్రభుత్వం... పథకం అమలుపై అవగాహన సదస్సులు నిర్వహించనుంది. దళిత కుటుంబాల రిజిస్ట్రేషన్లు, కలెక్టర్ జారీ చేసే నిధుల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం ఇవన్నీ కమిటీలే నిర్వర్తించనున్నాయి. దళిత బంధును మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళిత బంధు ప్రారంభించారు. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలు ఉండగా... వారందరి ఖాతాల్లో గురువారం రూ.10 లక్షలు జమఅయ్యాయి.
అయితే ఈ కార్యక్రమం దళితలకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో అనే అంశంపై ఏబీపీ దేశంతో మాట్లాడారు డిక్కీ(Dalit Indian Chamber of Commerce and Industry) ప్రెసిడెంట్ నర్రా రవి కుమార్. ప్రభుత్వం ఇస్తున్న ఈ నగదు లబ్ధిదారులు తమ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఆర్ధిక క్రమశిక్షణతో ఈ నగదు వాడుకోవాలన్నారు. ఈ నగదు ఇవ్వడమే కాకుండా వాటిని సవ్యంగా వినియోగించుకోవడంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం పూర్తి గ్రాంట్ తో ఇస్తున్న ఈ నగదును ఏవిధంగా వినియోగించుకోవాలో, దళితులకు సంబంధించిన ఇతర పథకాలపై రవి కుమార్ వివరించారు.