Telangana CM KCR: బీజేపీని గందరగోళంలో పడేస్తున్న కేసీఆర్ రాజకీయ వ్యూహాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు బీజేపీని గందరగోళంలో పడేస్తున్నాయి. ఎందుకంటే సాధరణంగానే ఆయన రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అలాంటిది ఢిల్లీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజులపాటు ఉన్న కేసీఆర్.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసే కేసీఆర్.. ఢిల్లీలో మకాం వేసి కేంద్ర మంత్రులతో భేటీలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడంలో తలమునకలై ఉన్నారు. దుబ్బాక ఓటమితో బీజేపీతో బిగ్ ఫైట్ అని చెప్పిన కేసీఆర్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం తరువాత వ్యూహాలలో కాస్త తగ్గినట్లు కనిపించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడంతో తెలంగాణ బీజేపీ నేతలను కేసీఆర్ వ్యూహాలపై కన్‌ఫ్యూజ్ అయ్యేలా చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.