T20 World Cup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఇండియా ఈ రెండు మ్యాచ్‌ల్లో మైదానంలోకి కూడా దిగకముందే ఓటమి ఖరారైంది. అదేంటి మైదానంలో ఆటతీరు కదా.. గెలుపోటములను నిర్ణయించేది అనుకుంటున్నారా? కానీ దుబాయ్ పిచ్‌లపై గెలుపోటములను నిర్ణయించేది ఆటతీరు కాదు.. టాస్. అవును.. మీరు చదివింది నిజమే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే చాలు.. సగం విజయం అక్కడే లభిస్తుంది. అయితే ఇది ఏమాత్రం సమంజసం కాదు. మ్యాచ్ మీద మంచు ప్రభావం ఉన్నప్పటికీ.. దాని కంటే పిచ్‌లు ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతున్నాయి. మ్యాచ్ ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న పిచ్‌లు.. సాగేకొద్దీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి బంతి చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది. అది టాస్ ఓడిన జట్టు కొంప ముంచుతోంది.