Zimbabwe vs India 3rd T20I Match Highlights | జింబాబ్వేపై మూడో టీ20 లో 23 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి | ABP Desam
మొదటి టీ20 మ్యాచ్ లో పరాజయం పాలైన యువభారత్ ఆ ఓటమి నుంచి చాలా వేగంగా కోలుకుంది. రెండో టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీతో భారత్ ఘన విజయం సాధిస్తే మూడో టీ20 లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ యంగ్ ఇండియా సత్తా చాటింది. హరారేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...ఈ మ్యాచ్ లో యశస్వి జైశ్వాల్ తిరిగిరావటంతో గిల్ తో పాటు ఓపెనింగ్ దింపింది. జైశ్వాల్ 36పరుగులు చేసి గిల్ తో కలిసి ఫస్ట్ వికెట్ కే హాఫ్ సెంచరీ పార్ట్ నర్ షిప్ తో మంచి స్టార్టింగ్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఈ మ్యాచులో 10పరుగులకే ఔట్ కాగా...కెప్టెన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి బౌండరీల మోత మోగించాడు. గిల్ 49బాల్స్ లో 7ఫోర్లు 3సిక్సర్లతో 66పరుగులు చేసి అదరగొడితే..గైక్వాడ్ 28 బాల్స్ లో 4ఫోర్లు 3 సిక్సర్లతో 49పరుగులు చేసి ఔటై తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 182పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టాప్ ఆర్డర్ ను భారత పేసర్లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ కుప్పకూల్చారు. వీరికి వాషింగ్టన్ సుందర్ కూడా తోడవటంతో ఓ దశలో జింబాబ్వే 39పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. కానీ డియోన్ మైర్స్ వీరోచితంగా పోరాడాడు. వికెట్ కీపర్ క్లైవ్ మదాండే తో కలిసి 6వికెట్ కు 67పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పాడు. మదాండే 37పరుగులకు ఔట్ అవటంతో జింబాబ్వే ఆశలు నీరుగారాయి. డియోన్ మైర్స్ 48బంతుల్లో 7ఫోర్లు ఓ సిక్సర్ తో 65 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 6వికెట్ల నష్టానికి 159పరుగులు చేసి మంచి ఫైటింగే ఇచ్చింది. భారత్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీసుకోగా..4ఓవర్లలో కేవలం 15పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించటంతో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ఐదు టీ20ల సిరీస్ 2-1తేడాతో ముందంజలో నిలిచింది.