డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్ టెస్ట్‌లో రికార్డుల మోత
కాన్పూర్ టెస్ట్ డ్రా అవుతుందని అని దాదాపు అంతా ఫిక్స్ అయిన టైమ్‌లో ఒక్కసారిగా విరుచుకుపడింది టీమిండియా. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఒక్కరోజులో మొత్తం సీనే మారిపోయింది. పూర్తిగా గేమ్‌ని తన చేతుల్లోకి తెచ్చుకుంది. బంగ్లాదేశ్‌ని ఆలౌట్ చేసి బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా...T20 చూస్తున్నామా అనే రేంజ్‌లో ఆటాడుకుంది. అంతే కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే రికార్డులూ సృష్టించింది. ఇంగ్లాండ్ బజ్‌బాల్ స్ట్రాటెజీని బంగ్లాదేశ్‌పై ప్రయోగించింది రోహిత్ సేన. యశస్వి జైస్వాల్, విరాట్ కొహ్లి, కేఎల్ రాహుల్ బౌండరీలతో స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించారు. ఈ టెస్ట్‌కి ఇంకొక్క రోజు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇదే విధ్వంసాన్ని కంటిన్యూ చేస్తే..భారత్ గెలుపు పక్కా. ఇక రికార్డుల విషయానికొస్తే.. టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 18 బాల్స్‌లో 50 రన్స్ చేసింది టీమిండియా. ఇంత తక్కువ బాల్స్‌లో అత్యంత వేగంగా ఇన్ని రన్స్ చేసిన టీమ్‌గా ఇండియా రికార్డు సృష్టించింది. ఇదొక్కటే కాదు. టెస్ట్ ఇన్నింగ్స్‌లో అతి తక్కువ ఓవర్లలో ఎక్కువ రన్స్ చేసిన రికార్డునీ సొంతం చేసుకుంది. 10 ఓవర్లలో 100 పరుగులు, 18 ఓవర్లలో 150, 24 ఓవర్లలో 200, 30 ఓవర్లలో 250 రన్స్ సాధించింది. అంతకు ముందు వెస్టిండీస్‌పై ఉన్న రికార్డుని తిరగరాసింది.