IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా
టెస్ట్ క్రికెట్ లో బాజ్ బాల్ ను ఇంగ్లండ్ ఏ స్థాయిలో ప్రమోట్ చేసుకుందో మనందరికీ తెలుసు. అసలు బాజ్ బాల్ స్థాయిని మించిన దూకుడైన క్రికెట్ ప్రపంచంలో లేదనే స్థాయి ఫీలింగ్ వాళ్లది. దానికి సమాధానం టీమిండియా చెప్పింది. ఈ కొత్త టెక్నిక్ ను భారత్ అభిమానులు గంబాల్ అని పిలుస్తున్నారు. గంభీర్ కోచింగ్ టాక్టిక్స్, రోహిత్ శర్మ దూకుడైన కెప్టెన్సీ కలిసి మ్యాజిక్ చేశాయి. లేదంటే వర్షం కారణంగా దాదాపు మూడు రోజులు తుడిచిపెట్టుకుపోయిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఫలితాన్ని రెండురోజుల్లోనే సాధించింది. టెస్ట్ క్రికెట్ లోనే మునుపెన్నడూ ఏ జట్టూ చూపించని దూకుడును ప్రదర్శిస్తూ 8పైగా రన్ రేట్ తో మొదటి ఇన్నింగ్స్ లో 285పరుగులు చేసిన టీమిండియా..బంగ్లా దేశ్ ను రెండో ఇన్నింగ్స్ లో 146పరుగులకే కుప్పకూల్చింది. అశ్విన్, జడ్డూ,బుమ్రా మూడేసి వికెట్లతో బంగ్లాపులలు తోకముడిచేలా చేశారు. ఇక బంగ్లా విసిరిన 95పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడువికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. ఇప్పటికే మొదటి టెస్టు నెగ్గిన భారత్..ఇప్పుడు అనూహ్యంగా డ్రా ముగియాల్సిన రెండో టెస్టును రెండు రోజుల్లో చేజిక్కించుకుని 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. దూకుడైన టెస్ట్ క్రికెట్ కు భారత్ కూడా సరికొత్త నిర్వచనం ఇచ్చింది.