Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?
ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జైషా ఉంటున్నారని వార్తలు మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. రెండేళ్ల పొడిగింపుతో మొత్తం నాలుగేళ్లపాటు బార్ క్లే నే ఐసీసీ ఛైర్మన్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పదవిని చేపట్టాలని జైషా ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. 35ఏళ్ల జైషా ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి ఛైర్మన్ గా, ఐసీసీలో అత్యంత కీలకమైన క్రికెట్ కౌన్సిల్ కమిటీకి ఛైర్మన్ గానూ ఉన్నారు. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా కుమారుడైన జై షా మొదటి నుంచి క్రికెటింగ్ వ్యవహారాల్లో చాలా ఇంట్రెస్ట్ ను చూపించేవారు. అలా ఇప్పుడు ఏకంగా ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. ఈనెల 27 లోపు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉండంటంతో జైషా ఆ దిశగా ఆలోచనలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికలో మొత్తం 16ఓట్లు ఉంటాయి. ఉన్న 16ఓట్లలో ఐసీసీ ఛైర్మన్ కావాలంటే 9 ఓట్లు పడాల్సి ఉంటుంది. మరి ఆ తొమ్మిది ఓట్లు జైషాకు అనుకూలంగా ఉన్నాయా. అసలు ప్లాన్ ఏంటంటే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సో ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఎన్నికై రెండేళ్ల తర్వాత తన పదవిని ఎక్స్ టెంట్ చేయించుకుంటే 2028 ఒలింపిక్స్ లో భారత్ క్రికెట్ ఆడేప్పుడు ఆయనే ఐసీసీ ఛైర్మన్ గా ఉంటారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని జైషా వదులుకోరని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఐసీసీ ఛైర్మన్ గా ముగ్గురు భారతీయులు వ్యవహరించారు. జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్ లు గతంలో ఐసీసీ ఛైర్మన్ గా చేశారు. ఇప్పుడు జై షా ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికై ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా అత్యంత పిన్నవయస్కుడైన వ్యక్తిగా రికార్డులు సృష్టిస్తాడు.