Champions Trophy 2025 Draft Schedule | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూలు ఖరారు అయిందా?
Sports Telugu Videos: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఒక థ్రిల్లర్ మ్యాచ్‌ను టీ20 వరల్డ్ కప్‌లో చూశాం. కానీ ఇటువంటి క్లాష్ మళ్లీ ఎప్పుడు చూస్తామనే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్‌ను తొలుస్తూనే ఉంటుంది. కానీ ఆరోజు ఎంతో దూరంలో లేదన్నట్లు కనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఎనిమిది నెలల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ తలపడతాయి. 2025 మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి చెందిన డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ అయింది. దీన్ని ఐసీసీకి కూడా సబ్మిట్ చేశారట. ఎనిమిది జట్ల మధ్య జరగనున్న 15 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్‌లో పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుందట. పూర్తిస్థాయి షెడ్యూల్‌పై ఐసీసీ ప్రస్తుతం కసరత్తు చేస్తుంది.
ప్రస్తుతానికి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు లాహోర్ వేదికగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరిగితే ఆ టోర్నమెంట్‌ను భారత్ ఆడుతుందా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే దీనికి భారత ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది. గతేడాది జరిగిన ఆసియా కప్ తరహాలో భారత్ ఆడిన మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన యూఏఈలో నిర్వహించారు. మరి ఈసారి బీసీసీఐ, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్, కరాచీ, రావల్పిండిలను వేదికలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్ వెళ్తే... లాహోర్ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతానికి పీసీబీ, ఐసీసీ రెండూ హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ భారత్, బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి మరి!