Mumbai Rave Party: ముంబయి రేవ్ పార్టీ... డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు..!
ముంబయి రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పష్టం చేసింది. ఈ పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్‌సీబీ వెల్లడించింది. ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్‌సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. వీరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిలో ముగ్గురికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తోంది ఎన్‌సీబీ. వీరిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. మాదకద్రవ్యాలను అనుమానితులు తమ దుస్తులు, లోదుస్తులు, పర్సులలో దాచేసుకున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు