Farmers Win: అన్నదాతల పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం - సాగు చట్టాల రద్దుకు నిర్ణయం
రైతు గెలిచాడు. రైతు నిలిచాడు. నిజం...చర్మం ఊడి రక్తం ఓడుతున్నా అదే కాళ్లతో దేశమంతా తిరిగారు..- అణిచివేయాలని ఎన్ని శక్తులు చూసినా.. ఆఖరి శ్వాసను బిగబట్టి గొంతు అవిసిపోయేలా అరిచారు. అన్నం పెట్టే రైతు.. ఆకలితో మాడుతూనే మాకొద్దీ సాగు చట్టాలు అంటూ రణనినాదాలు చేశాడు. సంఘ విద్రోహ శక్తులన్నా.. దేశద్రోహులున్నా.. ఆఖరికి ప్రాణాలు పోతున్నా వెనుకడుగు వేయలేదు. ఏ నినాదంతోనైతే తొలిరోజు ఆందోళన మొదలుపెట్టారో అదే ఉద్ధృతిని కడదాకా కొనసాగించారు కాబట్టే.....కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. నిజం ఇది రైతు సాధించిన ఘన విజయం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేనికోసమైనా కావచ్చు....కానీ అది రైతు వద్దంటున్నాడంటే వద్దనే అర్థం. శ్రమనంతా దారపోసి ఆరుగాలం కష్టించే రైతు...కంటికి రెప్పలా పంటను కాపాడుకునే రైతు....తనకు ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకోలేడా...అదే నిజమైంది. ఈరోజు ప్రధాని మోదీ చేసిన ప్రకటన సంక్షిప్తమే కావచ్చు. కానీ దాని వెనుక గడచిన కొన్నేళ్లుగా కుటుంబాన్ని వదిలిపెట్టి ఊరుకాని ఊరిలో... పొలిమేరల్లో.... పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ....తుపాకీ గుళ్లను కాచుకుంటూ....ముళ్లకంచలను తొక్కుకుంటూ తెగబడి నిలబడిన రైతన్నల ఆవేదన సుదీర్ఘం.