Tirumala Rains: తిరుపతిలో జలప్రళయం... కాలనీలను ముంచెత్తిన వరద
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయం అయ్యింది. రైల్వే అండర్ బ్రడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోగా.. నగరంలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్దనున్న అండర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వర్షపు నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలలో భారీ వర్షాలతో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద కొండచరియలు పడ్డాయి. పాపవినాశనం దారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. టీటీడీ సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమాఢ వీధులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో వరద చేరడంతో ప్రమాదకరంగా మారాయి. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణి సమీపంలో రహదారిపై చెట్టు కూలడంతో జేసీబీలతో తొలగిస్తున్నారు. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళ్లు కొట్టుకువస్తున్నాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి వరద నీరు చేరింది. బంగాళాఖాతానికి సమీపంలో ఉండటంతో వర్షాల ప్రభావం తిరుపతిపై అధికంగా ఉంటుంది.