Nara Lokesh: ఇద్దరు సీఎంలు తలచుకుంటే క్షణాల్లో ముంపు గ్రామాల సమస్య పరిష్కారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భద్రాద్రి సీతారామస్వామిని దర్శించుకున్నారు. భద్రాద్రిలో పర్యటించిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లోకేశ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. దైవదర్శనం అనంతరం లోకేశ్ కి వేదమంత్రోచ్ఛరణతో తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం లోకేష్ మాట్లాడారు. కరోనా కష్టాలు కడతేరాలని సీతారామస్వామిని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించాలని కోరానని అన్నారు. దేవుని సమక్షంలో రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. భద్రాచలం కేంద్రంగా రెండు రాష్ట్రాల మధ్య 5 పంచాయతీల సమస్య ఉందన్న ఆయన.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి స్నేహితులే కాబట్టి వారు తలచుకుంటే క్షణాల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. లోకేశ్ పోలవరం ముంపు మండలాల్లో ఇవాళ, రేపు పర్యటించనున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటన కొనసాగిస్తారు.