Live Video: కొండపై నుంచి జారిపడి పూజారి మృతి... అనంతపురం జిల్లాలో విషాద ఘటన
తరతరాల ఆచారం అసువులు తీసింది. భగవదారాధనలో ఓ అర్చకుడు లోయలో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామ శివారు కొండల్లోని గుహలో గంపమల్లయ్య స్వామి కొలువుదీరారు. ఈ స్వామిని తరతరాలుగా అప్పా పాపయ్య కుటుంబీకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఇందులో అన్యులకు ప్రవేశం లేదు.
స్వామిని దర్శించడం ఓ సాహసమే.
అన్యులకు దర్శించే వీలు లేదు
చిన్నజలాలపురం కొండల్లోని శ్రీ గంపమల్లయ్య స్వామికి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శనివారాలు స్వామివారికి విశేష పూజలు చేస్తారు. ఇక్కడి గుహల్లో కొలువైన స్వామిని పూజారి తప్ప అన్యులు దర్శించే వీలు లేదు. అక్కడి నుంచే పూజారి అందించే హారతిని కళ్లకు అద్దుకుంటారు. గంప మల్లయ్య కొలువైన కొండ గుహలోకి చేరడం పూజారికి సాహసమనే చెప్పాలి. నిటారుగా ఉన్న ఈ కొండపైకి జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కొండ మధ్యలోని గుహ వరకు జారుకుంటూ వెళ్లాలి. ఈ క్రమంలో ఏమాత్రం పట్టు తప్పినా కొండ బండరాళ్లను ఢీ కొంటూ లోయలోకి పడిపోకతప్పదు.
అనూహ్యంగా ప్రమాదం..
ఈ సంవత్సరం కూడా శ్రావణ రెండో శనివారం నాడు, పూజారి పాపయ్య, కొండ శిఖరంపై స్వామివారికి హారతులిచ్చారు. శిఖరం దాకా చేరిన భక్తులు కూడా ఆయనతో పాటు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గుహలోని స్వామిని దర్శించుకునేందుకు.. కొండమీది నుంచి జారబోయిన పాపయ్య అదుపు తప్పి, కొండ బండరాళ్లకు కొట్టుకుంటూ.. లోయలో పడి దుర్మణం పాలయ్యాడు. ఈ దుర్ఘటన చూసి భక్తులు హాహాకారాలు చేశారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని రీతిలో ఈ దుర్ఘటన జరగడంతో వారు హతాశులయ్యారు. ఘటనా స్థలానికి శింగనమల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో గంపమల్లయ్య స్వామి వారి శ్రావణమాసోత్సవాలు విషాదమయమయ్యాయి.
Also Read: Huzurabad KCR : ఖాళీ చేసి వెళ్లిపోయిన నేతలు.. హుజూరాబాద్‌లోనే ఉండాలంటున్న కేసీఆర్..!