Ananta TDP : జేసీ వర్సెస్ కాల్వ ! అనంత టీడీపీలో పెరిగిపోతున్న గ్రూపుల గోల !

Continues below advertisement

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల వర్గ పోరాటం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కుతూ మూలుగుతూ రెండు అసెంబ్లీ సీట్లకే పరిమితమైనా.. మున్సిపల్,, పంచాయతీ ఎన్నికల్లో కోలుకోలేనంత దెబ్బపడినా ఆ జిల్లా టీడీపీ నేతలు మాత్రం వర్గ పోరాటాలను వదిలి పెట్టడం లేదు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో చేసిన ప్రకటనలు కూడా ఈ వర్గ పోరాటంలో ఓఅంకం అని చెబుతున్నారు.

అనంతపురం పార్లమెంటరీ టీడీపీ కమిటీలను ఇటీవల ప్రకటించారు. అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేసీ వర్గానికి పెద్దగా పదవులు దక్కలేదు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేసి ఓడిపోయారు. దానికి తగ్గట్లుగానే తమ వారికి కమిటీల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని వారు కోరుకున్నారు. కానీ వారు కోరుకున్న వారికి పరమితంగానేపదవులు దక్కాయి. ముఖ్యంగా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ కమిటీ ఎంపిక వ్యవహారంలో స్థానిక ఇంచార్జి బండారు శ్రావణి వర్గానికి పెద్దగా పదవులు రాలేదు. ఆమె జేసీ వర్గీయులుగా గుర్తింపు పొందారు. 

శింగనమల నియోజకవర్గం ఇంచార్జ్‌గా బండారు శ్రావణినే ఉంటారు. అయితే కొత్తగా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలతో ద్విసభ్య కమిటీని కూడా నియమించారు. ఇకపై నియోజకవర్గంలో పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా,  కార్యక్రమం చేపట్టాలన్నా... ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇది శ్రావణి వర్గానికి నేరుగా చెక్ పెట్టడమేనని జేసీ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడే కాదు, ఉరవకొండ నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని జేసీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కమిటీల ఎంపికలో ఏకపక్ష విధానాలతో కాల్వ శ్రీనివాసులు తమను అవమానించారంటూ, శింగనమల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు.. కాల్వ శ్రీనివాసులుతో గొడవకు దిగి, పార్టీ కార్యాలయంలోనే ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను బయటకు పంపాల్సి వచ్చింది. 
 
తమకు అన్యాయం జరిగిందంటూ జేసీ వర్గీయులు  పెద్దపప్పూరు మండలం జూటూరులోని జేసీ దివాకరరెడ్డి ఫాంహౌస్ లో ఆయన్ని కలిశారు. పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని జేసీ దివాకరరెడ్డికి వివరించారు. రెండేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసీ దివాకర్ రెడ్డి ఎక్కువగా తన ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన పార్టీ నేతలతో నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అన్నింటినీ పరిశీలించాల్సి ఉందన్నారు. టీడీపీకి కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో పార్టీ నేతలు ఇప్పటికీ కలసి కట్టుగా పోరాటం చేయలేకపోతూండటం ఆ పార్టీ శ్రేణుల్ని కూడా నిరాశకు గురి చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram