గభగ మండే సూర్యుడి ఉపరితలంపై భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ‘కరోనల్ మాస్ ఎజెక్షన్’ (Coronal mass ejection) అని అంటారు. అయితే, కొన్ని మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడిపై పేలుడు జరిగితే భూమికి కలిగే నష్టం ఏమిటని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి, సూర్యుడికి, భూమికి చాలా దగ్గర సంబంధం ఉంది. సూర్యుడిపై ఏం జరిగినా అది భూమిపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే, ‘కరోనల్ మాస్ ఎజెక్షన్’ ప్రభావం భూమిపై కూడా ఉండనుంది. సూర్యుడిపై ఏర్పడిన ఈ విస్ఫోటనం వల్ల ‘కరోనల్ మాస్ ఎజెక్షన్’ భూమి వైపు వేగంగా దూసుకోస్తోందని, ఇది గురువారం (మార్చి 31న) భూమిని తాకనుందని కోల్‌కతా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ హెచ్చరించింది.  


కరోనల్ మాస్ ఎజెక్షన్(CME) ఒక బిలియన్ టన్నుల పదార్థంతో అంతరిక్షంలో గంటకు అనేక మిలియన్ మైళ్ల వేగంతో దూసుకొని వస్తుంది. ఈ సౌర పదార్థం ఇంటర్‌ప్లానెటరీ మాధ్యమం ద్వారా ప్రయాణిస్తుంది. దాని మార్గంలో ఏదైనా ఉపగ్రహం లేదా అంతరిక్ష నౌక అడ్డుగా ఉన్నట్లయితే, తీవ్ర ప్రభావానికి గురవ్వుతాయి. వాటిలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా భూమిపై రేడియో కమ్యునికేషన్ నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడుతుంది.   


మార్చి 28న సూర్యుని ఉపరితలంలోని 12975, 12976 ప్రాంతాల్లో భారీ పేలుడు ఏర్పడింది. ఆ మంటలు(CME) భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకడంతో కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రేరిత భూ అయస్కాంత తుఫానులు వచ్చే అవకాశం ఉంది. మార్చి 31న 496-607 kmps(1 kmps = 3600 kmph) వేగంతో ఇది దూసుకోస్తోందని, ఇది  భూమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా (CESSI) ట్విట్టర్‌లో వెల్లడించింది.


భవిష్యత్తులో మరిన్ని విస్ఫోటనాలను ఉత్పత్తి చేయగల సూర్యుని ఉపరితలంపై కొత్త సన్‌స్పాట్‌లను కూడా CESSI గుర్తించింది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)లోని US-ఆధారిత స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ కూడా దీన్ని ధృవీకరించింది. బలమైన భూ అయస్కాంత తుఫాను మార్చి 31న భూమిని తాకుతుందనున్నట్లు అంచనా వేసింది. దీనివల్ల శాటిలైట్ నావిగేషన్, తక్కువ-ఫ్రీక్వెన్సీ రేడియో నావిగేషన్ సమస్యలు ఏర్పడవచ్చని తెలిపింది.


Also Read: మొబైల్ అతిగా వాడితే మెదడులో కణితి? మీరు ఈ గుడ్ న్యూస్ వినాల్సిందే!


భూ అయస్కాంత తుఫాన్ భూమిని తాకడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ పంపిన 40 స్టార్‌లింక్ ఉపగ్రహాలు జియోమాగ్నెటిక్ తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. అప్పట్లో అది కరోనల్ మాస్ ఎజెక్షన్ ఫలితంగా సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ అయస్కాంత తుపాన్ వల్ల గురువారం తక్కువ ఎత్తులో అరోరాలు కనిపించే అవకాశం ఉంది. అయితే, పవర్ గ్రిడ్, కమ్యునికేషన్ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్లు కూడా మూగబోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, అది భూఅయస్కాంత తుఫాన్ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. రేపు మీ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్‌లు పనిచేయకపోతే కంగారు పడకండి. 


Also Read: శృంగారం చేసినా, చేయకపోయినా వారానికి ఇన్ని సార్లు స్కలించాల్సిందే, లేకపోతే..