కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! డియర్‌ నెస్‌ అలవెన్స్‌ (DA) 3 శాతం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది. కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 31 శాతం డీఏ ఇస్తున్నారు. దీనిని మరో 3 శాతానికి పెంచడంతో డీఏ 34 శాతానికి చేరుతుంది. బడ్జెట్‌ రెండో దశ సమావేశాలకు ముందే కేబినెట్‌ సమావేశమైంది. అప్పుడే ఈ అంశం చర్చకు వచ్చింది. తాజాగా నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.


DA ఎందుకిస్తారంటే?


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్‌ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్‌, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్‌ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.


Also Read: ఐదో తేదీ వరకూ బ్యాంక్ వైపు వెళ్లకండి ! ఎందుకంటే ?


Also Read: ఈపీఎఫ్ అలర్ట్ - రూ.7 లక్షల బెనిఫిట్స్ పొందాలంటే ఇది తప్పనిసరి, మార్చి 31 డెడ్‌లైన్


డీఏ పెంచడం వల్ల కోటికి పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. చివరిసారిగా డీఏను గతేడాది అక్టోబర్లో సవరించారు. 28 నుంచి 31 శాతానికి పెంచారు. ఇప్పుడు డీఏ పెంచితే పెంచిన వేతనాల్లో జనవరి, ఫిబ్రవరి డీఏ బకాయిలు కూడా ఉంటాయి. ఎందుకంటే దీనిని 2022 జనవరి నుంచి అమలు చేస్తారు.