Consumer Forum Verdict On Compesation Of Damaged Car: ఓ వ్యక్తి తన కారును రిపేర్ చేయించడం కోసం సర్వీస్ సెంటర్‌కు తరలించాడు. అయితే, వరదలు రావడంతో సర్వీస్ సెంటర్‌లో ఉన్న కారు పూర్తిగా పాడైంది. ఎంతలా అంటే కారు ధర రూ.51 లక్షలు కాగా రిపేర్లకు రూ.50 లక్షలు అంచనా వేసేంతగా పాడైపోయింది. అయితే, సరైన సమయానికి కారు రిపేర్ చేయకుండా అది వరదలో మునిగిపోవడానికి కారణమయ్యారంటూ సర్వీస్ సెంటర్‌పై సదరు వాహన యజమానికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధ్యత తీసుకోవాలని కోరగా.. వారు నిరాకరించడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కమిషన్ రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని సర్వీస్ సెంటర్‌ను ఆదేశించింది. పూర్తి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని (Hyderabad) బ్లూ ఓషన్ మల్టీ క్లయింట్ ఆఫీస్‌కు చెందిన ఓ వ్యక్తి 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో అకస్మాత్తుగా వాహనంలో ఏసీ పనిచేయలేదు. అంతే కాకుండా ఇంజిన్ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో అతను ఓ సర్వీస్ సెంటర్‌లో కారు రిపేర్ చేయించుకున్నాడు.
అనంతరం కొద్ది రోజులకు వాహనంలో మళ్లీ సమస్య ఏర్పడింది. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సదరు కారు యజమానికి 2020లో కృష్ణ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాడు. కారు రిపేర్ కోసం రూ.2.73 లక్షలు ఖర్చవుతాయని చెప్పి రిపేర్ కోసం వాహనాన్ని సర్వీస్ సెంటర్‌లోనే పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చి సర్వీస్ సెంటర్‌లో ఉన్న కారు పూర్తిగా మునిగిపోయి దెబ్బతింది. ఈ క్రమంలో కారు రిపేర్ కోసం రూ.50.45 లక్షల వరకూ ఖర్చవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది యజమానికి చెప్పారు. సకాలంలో కారు రిపేర్ చేయకుండా వాహనం వరదల్లో మునిగిపోవడానికి కారణమయ్యారని.. పూర్తిగా మీరే బాధ్యత వహించాలని సర్వీస్ సెంటర్ సిబ్బందిని నిలదీశాడు. దీనికి వారు అంగీకరించలేదు.
వినియోగదారుల ఫోరంలో పిటిషన్
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కారు యజమాని సర్వీస్ సెంటర్ యాజమాన్యంపై రంగారెడ్డి జిల్లా (Rangareddy District) వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కమిషన్.. సర్వీస్ సెంటర్ తీరును తప్పుబట్టింది. సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా వాహనం పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని తేల్చింది. రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్‌కు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సీహెచ్ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్ బాబు, శ్యామలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.