Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణ పనులు ప్రారంభించేందుకు జోరుగా అడుగులు పడుతున్నాయి. పనులకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) తయారీ తుది దశకు చేరింది. ప్రభుత్వ పెద్దల సూచనలు మేరకు పాతబస్తీ మార్గంలోని అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేసిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) అధికారులు ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వానికి డిపిఆర్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. డిపిఆర్ మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత అనుమతి కోసం కేంద్రానికి పంపించనున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది దసరా రోజున పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైళ్ల నిర్వహణకు కావాల్సిన డిపోలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపైన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి అందించే డిపిఆర్ లో డిపోలను కూడా చూపించాల్సి ఉండడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రెండో దశలో ఏడు కారిడార్లకు సంబంధించి కనీసం రెండు డిపోలను తప్పకుండా పెట్టాల్సి ఉంది. దీంతో అనువైన స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. 


రెండో దశలో ఏడు కారిడార్లు.. 78 కిలో మీటర్లు..


కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు మొత్తం ఏడు కారిడార్లలో 78.04 కిలోమీటర్లు మేర పనులను ప్రతిపాదించింది. ఇందులో మొదటి దశలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మిగిలిన 5.5 కిలోమీటర్లతోపాటు ఫలక్ నుమా నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మరో రెండు కిలోమీటర్లను అదనంగా చేర్చారు. ఈ రూట్ లో 7.5 కిలో మీటర్ల పనులు చేపట్టనున్నారు. నాగోలు నుంచి ఎల్బీనగర్ మధ్య మిగిలిన ఐదు కిలోమీటర్ల కలుపుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని 29 కిలోమీటర్ల వరకు నిర్మించనున్నారు. రాయదుర్గం - బయోడైవర్సిటీ జంక్షన్ - నానక్ రామ్ గూడ జంక్షన్ - విప్రో జంక్షన్ - అమెరికన్ కాన్సులేట్ వరకు,  మియాపూర్ మెట్రో స్టేషన్ -  బిహెచ్ఇఎల్ -  పటాన్ చెరు వరకు,  ఎల్బీనగర్ - వనస్థలిపురం - హయత్ నగర్ వరకు, మైలార్ దేవ్ పల్లి - ఆరంఘర్ - న్యూ హైకోర్టు వరకు కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాదిరిగా ఈ ప్రాజెక్టును ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడల్ లో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రైవేట్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.24042 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 35 శాతం నిధులు సమకూర్చాలని భావిస్తోంది. కేంద్రం నుంచి 15 శాతం నిధులు సేకరించనుంది. మిగిలిన 50 శాతంలో 45 శాతం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు లేదా జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా)లాంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులు సేకరించాలని, మరో ఐదు శాతం నిధులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


రోజుకు రెండు వేల సర్వీసులు నడిచే అవకాశం.. 


మొదటి దశలోని మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో ప్రతిరోజు 57 రైళ్లు నడుస్తున్నాయి. వీటి మెయింటెనెన్స్ కోసం మియాపూర్, ఎంజీబీఎస్, ఉప్పల్ లో డిపోలు ఏర్పాటు చేయడంతో సంబంధిత సిబ్బంది నిర్వహణ పనులను రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటలకు పర్యవేక్షిస్తుంటారు. రెండో దశలో భాగంగా చేపడుతున్న కారిడార్లకు సంబంధించిన డిపోలను కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నప్పటికీ.. అనువైన స్థలాలు దొరకడం లేదని తెలుస్తోంది. ఏయిర్ పోర్ట్ కారిడార్ లో మైలార్ దేవ్ పల్లిలో ఒకటి ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా గుర్తించినట్లు చెబుతున్నారు. రాయదుర్గం నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు నడిపించే రైళ్లకు కావాల్సిన డిపోను ఏర్పాటు చేయడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం అంతగా లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది. డిపో ఏర్పాటుకు తక్కువలో తక్కువగా 10 నుంచి 15 ఎకరాలు కావాల్సి ఉండడంతో ఏమి చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎంపిక చేయాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రెండో దశ విస్తరణలో మొత్తం ఏడు కారిడార్లు ఉండడంతో రోజుకు సగటున రెండు వేల సర్వీసులు నడిచే అవకాశం ఉందని, ఈ మేరకు కచ్చితంగా రెండు డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 


కీలకంగా నాగోలు - ఎయిర్ పోర్ట్ కారిడార్..


రెండో దశ ప్రతిపాదించిన ఏడు కారిడార్లలో నాగోలు - ఎయిర్ పోర్ట్ కారిడార్ ను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఈ మేరకు దీనిని ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పూర్తి చేయాలని ఆదేశించింది. సిస్త్రా కన్సల్టెన్సీ సహకారంతో డిపిఆర్ ను దాదాపుగా పూర్తి చేసినప్పటికీ డిపోల ఏర్పాటుకు కావలసిన స్థలాల కోసం వెతుకుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత కారిడార్లలో ప్రభుత్వ స్థలాలు ఆశించినంతగా లేకపోవడంతో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. నాగోలు - ఎయిర్పోర్ట్ మార్గంలోని మైలార్ దేవ్ పల్లి - పి7 రోడ్డు దగ్గర ఒక డిపోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మార్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలం ఉండడంతో డిపో పెట్టడం సులభతరం కానుంది. సుమారు 10 నుంచి 20 ఎకరాల స్థలాన్ని డిపో కోసం కావాలని డిపిఆర్ లో పొందుపరిచినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రో రెండోదశ పనుల ప్రారంభంపై వేగంగా కసరత్తు చేస్తోంది. దసరా నాటికి శంకుస్థాపన చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది.


Also Read: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు