Khairatabad Ganesh Immersion: వినాయక చవితి నవ రాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే పేరొందిన గణేష్ మండపాల్లో ఖైరతాబాద్ గణపతి ముందుండే సంగతి అందరికి తెలిసిందే. ప్రతిసారి ఏకంగా 60 అడుగులకు పైబడి ఎత్తుతో భారీ విగ్రహాన్ని నెలకొల్పుతూ ఉంటారు. ఈసారి కూడా ఏకంగా 70 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణేషుడు మంగళవారం నాడు నిమజ్జనం కానున్నాడు. హుస్సేన్ సాగర్‌లో ఈ భారీ గణపతి నిమజ్జనం జరగనుంది. అయితే, ఈ భారీ వినాయకుడ్ని ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్‌కు తీసుకెళ్లడం కూడా సవాలుతో కూడిన పనే.


ఎందుకంటే 70 అడుగుల విగ్రహం బరువు టన్నుల్లో ఉంటుంది. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రాజేంద్రన్‌ చెబుతున్న ప్రకారం.. మహాగణపతి విగ్రహం సుమారు 70 టన్నుల బరువు ఉంటుంది. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపైన తీసుకెళ్లేందుకు వీలు కాదు. అందుకే ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఏపీ నుంచి తెప్పించారు.


గతేడాది తరహాలోనే ఈసారి కూడా విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్ ​పోర్టుకు చెందిన ఒక భారీ టస్కర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దీనికి 26 చక్రాలు ఉంటాయి. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్ ​కు 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. ఈ డీఎస్-6 ట్రాయిలర్ వెహికల్ వరుసగా రెండోసారి భారీ గణపతిని మోసుకొని నిమజ్జనానికి తీసుకెళ్లనుంది. ఈ వాహనాన్ని నడిపే వ్యక్తి కూడా ప్రత్యేకంగానే ఉండనున్నారు. నాగర్ ​కర్నూలుకు చెందిన భాస్కర్ ​రెడ్డి అనే వ్యక్తి ఈ టస్కర్ ను నడిపించనున్నారు. ఇలా ఖైరతాబాద్ గణపతిని ఆయన హుస్సేన్ సాగర్ వరకూ తరలించడం 11వ సారి అని చెబుతున్నారు.


Also Read: వినాయకుని మెడలో నాగుపాము - ప్రత్యేక పూజలు చేసిన భక్తులు, వైరల్ దృశ్యాలు


ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు 70 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా.. విగ్రహాన్ని టస్కర్ పై సక్రమంగా అమర్చేందుకు వీలుగా దానిపై వెల్డింగ్ పనులు ఆదివారం పూర్తి చేశారు. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్​ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి వెల్డింగ్ ​పనులు పూర్తయ్యాయని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి టైంలో బడా గణపతిని టస్కర్ ​పైకి ఎక్కిస్తారని.. ఆ వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ చేస్తారని నిర్వహకులు తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచే గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగించేస్తారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేయించి.. విగ్రహాన్ని శోభాయాత్రకు రెడీ చేస్తారు.


ఈ ప్రక్రియ పూర్తవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అంటున్నారు. అనంతరం వివిధ రకాల పూలతో టస్కర్ ను అలంకరిస్తారు. మంగళవారం ఉదయాన్నే నిమజ్జన ఊరేగింపు మొదలు కానుంది. బడా గణేశుడి చెంతన ప్రతిష్ఠించిన శివ పార్వతులు, శ్రీనివాస కళ్యాణం, బాలరాముడు, రాహువు కేతువు విగ్రహాల కోసం హైదరాబాద్ ​కు చెందిన మరో ట్రక్ ను వినియోగిస్తున్నారు.


Also Read: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి