Sukanya Samriddhi Yojana Details In Telugu: పది వేల రూపాయలు మీరు చెల్లిస్తే, మీకు 56 లక్షల రూపాయలు తిరిగి వచ్చే మార్గం ఒకటుంది. ఇక్కడ మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు, మోసమూ లేదు. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అంటే... మీరు 10 వేల రూపాయలు కడితే, కేంద్ర ప్రభుత్వం మీకు 56 లక్షల రూపాయలు తిరిగి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓపెన్ స్కీమ్ కాబట్టి మోసానికి, దగాకు ఆస్కారమే లేదు. మీకు డబ్బు ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరు "సుకన్య సమృద్ధి యోజన" (SSY). ఈ పేరు మీరు వినే ఉంటారు. మీ కుమార్తెకు ఆర్థిక భద్రతను (financial security) అందించడం & వారి భవిష్యత్తు ఖర్చులను భరించే లక్ష్యంతో కేంద్ర సర్కారు ప్రారంభించిన పథకం ఇది. భారత ప్రభుత్వం నిర్వహణలో ఉన్న ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని (small savings scheme) 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
"బేటీ బచావో బేటీ పఢావో" (Beti Bachao Beti Padhao) క్యాంపెయిన్‌లో ఈ స్కీమ్ ఒక భాగం. ప్రధానంగా, ఆడపిల్లల ఉన్నత విద్య & వివాహానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని తగ్గించడం స్కీమ్ లక్ష్యం. అంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు నిశ్చింతగా నిద్రపోవచ్చు.
ప్రయోజనాలు (Benefits of Sukanya Samriddhi Yojana):
సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి వడ్డీ రేటు మాత్రమే కాదు, ఆదాయ పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. ఈ పథకం కింద, 0 నుంచి 10 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న కుమార్తె కోసం ఖాతాను తెరవవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి 250 రూపాయలు మాత్రమే. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల రూపాయలు కట్టొచ్చు. ఈ పథకంలోని పెట్టుబడులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాల (Income tax benefits of Section 80C) పరిధిలోకి వస్తాయి.
వడ్డీ (Interest Rate of Sukanya Samriddhi Yojana):
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికానికి ఒకసారి) నిర్ణయిస్తారు. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు వరకు నిర్ణయించిన వడ్డీ రేటు 8.2%. ఈ స్కీమ్ ద్వారా చక్రవడ్డీ (compound interest) ప్రయోజనం కళ్లజూడొచ్చు.
పెట్టుబడి & రాబడి (Investment and Returns of Sukanya Samriddhi Yojana):
ఉదాహరణకు... మీ కుమార్తె వయస్సు 5 సంవత్సరాలు అనుకుందాం. మీరు సంవత్సరానికి 1.20 లక్షల రూపాయలు (నెలకు 10,000 రూపాయలు) పెట్టుబడి పెడుతున్నారని భావిద్దాం. ఇలా 21 సంవత్సరాల పాటు కడితే ఆ స్కీమ్ ముగుస్తుంది. మెచ్యూరిటీ సమయంలో, మీ చేతికి సుమారు రూ.56 లక్షలు వస్తాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ.55.61 లక్షలు అందుకుంటారు. ఇందులో, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 17.93 లక్షలు కాగా, వడ్డీగా 37.68 లక్షలు వస్తాయి. ఇక్కడ మీకు చక్రవడ్డీ బెనిఫిట్ లభిస్తుంది.
ఒకవేళ, మీరు సంవత్సరానికి 1.50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే, స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో 69.80 లక్షల రూపాయలు అందుకుంటారు. ఇందులో, మీ పెట్టుబడి డబ్బు 22.5 లక్షలు & వడ్డీ డబ్బు 47.3 లక్షలు ఉంటాయి.
లాక్-ఇన్ పీరియడ్ (Lock-In Period of Sukanya Samriddhi Yojana):
సుకన్య సమృద్ధి యోజనలో లాక్-ఇన్ పీరియడ్ 21 సంవత్సరాలు. ఉదాహరణకు, మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఖాతాను తెరిస్తే, ఆమెకు 26 ఏళ్లు వచ్చేసరికి ఆ స్కీమ్ ముగుస్తుంది.
ముందస్తు ఉపసంహరణ (Premature withdrawals of Sukanya Samriddhi Yojana):
బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె ఉన్నత విద్య లేదా వివాహం కోసం అప్పటి వరకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ముందుస్తుగా ఖాతా రద్దు (Premature closure of Sukanya Samriddhi Yojana):
ఖాతాదారు లేదా సంరక్షకుడి మరణించినా, లేదా ఖాతాదారుకు ప్రాణాంతక వ్యాధి వంటి కొన్ని పరిస్థితుల్లో ఖాతాను ముందే క్లోజ్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, అలాంటి కీలక పరిస్థితులకు లోబడి, క్లోజ్ చేయడానికి అనుమతిస్తారు.
మరో ఆసక్తికర కథనం: ఏం స్టాక్ గురూ ఇది - ఫస్ట్ రోజే మల్టీబ్యాగర్, ఒక్కో లాట్‌పై భారీ లాభం