Bajaj Housing Finance IPO Listing: బజాజ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO స్టాక్ మార్కెట్‌లోకి చాలా బలంగా అరంగేట్రం చేసింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ఈ రోజు (సోమవారం, 16 సెప్టెంబర్‌ 2024) 114 శాతం బంపర్ ప్రీమియంతో మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఈ లెక్కన, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే తన పెట్టుబడిదార్లకు మల్టీబ్యాగర్ రిటర్న్‌ అందించింది. గతవారం ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చిన బజాజ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO రికార్డ్-బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకుంది. 


బజాజ్ హౌసింగ్‌ షేర్లకు బంపర్ ప్రీమియం
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ఈ ఉదయం BSEలో రూ.150 వద్ద, అంటే రూ.80 లేదా 114.29 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. అదే విధంగా, NSEలోనూ రూ. 150 వద్ద 114.29 శాతం ప్రీమియంతో అరంగేట్రం చేశాయి. 


ఒక్కో లాట్‌పై భారీ సంపాదన
బజాజ్ గ్రూప్‌నకు చెందిన ఈ IPOలో, షేర్ల ధరను కంపెనీ రూ.66-70గా నిర్ణయించింది. అప్పర్‌ ప్రైస్‌ ధర బ్యాండ్‌తో పోలిస్తే... షేర్ల లిస్టింగ్‌ సమయంలో IPO పెట్టుబడిదార్లు ఒక్కో షేరుపై రూ.80 సంపాదించారు. ఒక లాట్‌లో 214 షేర్లు ఉన్నాయి. ఈ విధంగా, బజాజ్ IPOలో పెట్టుబడిదార్లు కనీసం రూ. 14,980 (ఒక లాట్‌కు) పెట్టుబడి పెట్టారు. లిస్టింగ్ తర్వాత ఒక్క లాట్ విలువ రూ.32,100కి పెరిగింది. అంటే ఇన్వెస్టర్లు ప్రతి లాట్‌పై రూ.17,120 లాభం ఆర్జించారు.


రూ.లక్ష కోట్లు దాటిన మార్కెట్‌ క్యాప్‌
బంపర్ లిస్టింగ్‌తో, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Bajaj Housing Finance Market Cap) రూ. 1.07 లక్షల కోట్లను చేరింది. లిస్టింగ్‌ తర్వాత కాసేపటికే షేరు ధర రూ.160.92కి చేరుకుంది.


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌ IPO సెప్టెంబర్ 9, 2024న ఓపెన్‌ అయింది, సెప్టెంబర్‌ 11, 2024 వరకు బిడ్డింగ్ జరిగింది. IPO స్టార్ట్‌ కాగానే ఇన్వెస్టర్లు షేర్ల కోసం ఎగబడ్డారు. QIB కేటగిరీలో IPO రికార్డ్‌ స్థాయిలో 222.05 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. NII కేటగిరీ 43.98 రెట్లు, రిటైలర్ల విభాగం 7.41 రెట్లు, ఉద్యోగుల కోటా 2.13 రెట్లు, ఇతర కేటగిరీల ఇన్వెస్టర్లు 18.54 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు.


అనేక రికార్డులు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOకి మూడు రోజుల్లో 89 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఏ భారతీయ కంపెనీ IPOలోనూ ఇన్ని అప్లికేషన్స్‌ రాలేదు. దాదాపు రూ.6,500 కోట్ల విలువైన ఈ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు రూ.3.23 లక్షల కోట్ల విలువైన బిడ్స్‌ వేశారు. టాటా టెక్నాలజీస్ ఇటీవలి ఐపీఓకు రూ.1.5 లక్షల కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి. ఇప్పటివరకు, అత్యధిక బిడ్‌లు దాఖలైన రికార్డు కోల్‌ ఇండియా పేరిట ఉంది. 2010లో వచ్చిన ఆ ఐపీఓకు రూ.15,500 కోట్లకు బదులుగా రూ.2.36 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. ఆ రికార్డ్‌ను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బద్ధలు కొట్టింది.


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOలో.. రూ.3,560 కోట్ల విలువైన షేర్ల ఫ్రెష్‌ ఇష్యూ & రూ.3,000 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ షేర్లు ఉన్నాయి. ఫ్రెష్‌ షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును రుణాలు పంపిణీ వ్యాపారంలో కంపెనీ వినియోగించబోతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కేవలం రూ.160 పెరిగిన గోల్డ్‌, కొనేందుకు మంచి ఛాన్స్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి