తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. రాజ్యసభలో ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశం గురించి తాను నేరుగా అడుగుతున్నానని, రాష్ట్రంలోని మొత్తం ధాన్యం కొంటారా? కొనరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి గింజను కొంటామని గతంలో కేంద్ర మంత్రి చెప్పారని సంబంధిత పత్రికా ప్రకటనను చూపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనకు కట్టుబడి ఉందా లేదా చెప్పాలని నిలదీశారు. గత ఏడాది కేంద్రం తెలంగాణ నుంచి 94 లక్షల టన్నులు కేంద్రం కొన్నదని, ఈ ఏడాది కేవలం 19 లక్షలు మాత్రమే కొంటుందని ప్రశ్నను ముగించారు.
మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతారు?: పీయూష్ గోయల్
దీనిపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పందించారు. ‘‘గతంలో కేంద్ర మంత్రి ప్రకటన గురించి నాకు తెలీదు. కానీ, నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కేంద్రం ఏటా కొనుగోలు చేసే ధాన్యం పెరుగుతూ వస్తోంది. 2018-19 ఏడాదిలో ధాన్యం 443 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 2020-21 ఏడాదికి 518 నుంచి 600 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యాన్ని రాష్ట్రాల నుంచి కొన్నాం. ఒక్క తెలంగాణ విషయంలో 51.9 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంతేకాక, తెలంగాణతో చేసుకున్న ఎంఓయూ కూడా ఉంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ ఎంఓయూ చేసుకున్నాం. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకి ఇవ్వబోమని తెలంగాణనే రాత పూర్వకంగా ఇచ్చింది. దాని ప్రకారం.. మళ్లీ మళ్లీ ఈ సంగతిని ఎందుకు ఎత్తుతున్నారో అర్థం కావడం లేదు. గతేడాది మాదిరిగా సేకరించిన ధాన్యం మేరకు ఇంకా మిగిలిన 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఏడాది కూడా కొంటాం.’’ అని పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.
టీఆర్ఎస్ మరో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో పండుతున్న ధాన్యం అంతగా పెరగడానికి కారణం.. సాగునీటి రంగంలో కొన్నేళ్లుగా ప్రభుత్వం చాలా పెట్టుబడులు పెట్టింది. తద్వారా వరి సాగు పెరిగింది. తెలంగాణ వాతావరణం వల్ల యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుంది కాబట్టి.. ఇప్పటికే యాసంగి కోసం కొంత మంది రైతులు పంట వేశారు. కాబట్టి.. వచ్చే పంట కోసం ధాన్యం కొంటారా కొనరా? అనేది కేంద్ర మంత్రి స్పష్టం చేయాలి’’ అని ప్రశ్నించారు.
కర్ణాటక విధానం ఫాలో అవ్వాలి: కేంద్ర మంత్రి
దీనిపై పీయుష్ గోయల్ స్పందిస్తూ.. ‘‘గతేడాది కూడా తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొన్నాం. కానీ, దాన్ని నిల్వ చేయాల్సి వస్తోంది. 2019-20 ఏడాదిలో 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తామని తెలంగాణే చెప్పింది. కానీ, మాకు 42 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేశారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం అనుసరిస్తున్న అద్భుత విధానాన్ని ఫాలో అవ్వాలి. అక్కడ వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి, అందరూ అక్కడి విధానాన్ని అధ్యయనం చేయాలి. ప్రస్తుత సంవత్సరానికి గానూ ఇంకా 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఇవ్వగలరు. ఇంకా ఈ పరిమితి పెంచే విషయంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది.
కానీ, బాయిల్డ్ రైస్ సేకరించే ఒరిజినల్ టార్గెట్ 24.75 లక్షల మెట్రిక్ టన్నులు. వారు అడిగిన ప్రకారం ఈ పరిమితిని రెట్టింపు చేసి 44 లక్షల మెట్రిక్ టన్నులు చేశాం. కానీ, ఇప్పటి వరకూ తెలంగాణ నుంచి ఈ ఏడాది కేంద్రం 27.78 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించింది. దీని ప్రకారం.. ఇంకా 17 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు సేకరించాలి. కానీ, మీరు ఆ పరిమితిని ఇంకా పెంచాలని అడుగుతున్నారు. అదీ కాక, ఎఫ్‌సీఐతో చేసుకున్న ఎంఓయూ కూడా ఉంది. కాబట్టి, దాన్ని పెంచడం సాధ్యం కాదు.
ధాన్యం కొనుగోలు విషయంలో సమన్యాయం ఉండాలని ప్లకార్డులు చూశా. కానీ, ఏదైతే ఎంఎస్పీ పాలసీ ఉంటుందో అది దేశమంతా ఒకేలా ఉంటుంది. ఈ ఏడాది ఇంకా మాకు పంపాల్సిన 17 లక్షల బాయిల్డ్ రైస్‌ను పంపండి. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా చెప్పాను. మళ్లీ ఎందుకు అదే విషయాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు?’’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.
Also Read: టీఆర్ఎస్‌కు ప్రశాంత్ కిషోర్ సేవలు ! జాతీయ రాజకీయాల కోసమా ? రాష్ట్రంలో మళ్లీ గెలుపు కోసమా ?
Also Read : ఒమిక్రాన్ ఎప్పుడైనా రావొచ్చు... తెలంగాణలో హైఅలర్ట్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి