ఉజ్జయిని మహాంకాళి బోనాలు ప్రారంభం, మంత్రి తలసాని కుటుంబం తొలి బోనం
ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి నేడు (జూలై 9) వేకువజామున 3.30 గంటలకే ఆలయానికి చేరుకుని, కుటుంబ సమేతంగా బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబానికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మంత్రి, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. నేడు, ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆదమయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు. పూర్తి వివరాలు
బీజేపీ - బీఆర్ఎస్ మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైనట్లేనా ? కేసీఆర్ ఎందుకు స్పందించలేదు ?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ సభకు వచ్చారు. సభలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను ఉందని హెచ్చరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడిస్తామన్నారు. ప్రధాని మోదీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిన మోదీని తన్ని తరిమేస్తారనే ఘాటు ప్రకటనలు చేశారు. హరీష్ రావు దగ్గర్నుంచి జగదీష్ రెడ్డి వరకూ అందరూ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ బీజేపీ - బీఆర్ఎస్ మధ్య యుద్ధం ప్రారంభమయిందా అన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో ఆ ఎఫెక్ట్ అయితే రాకుండా పోయింది. పూర్తి వివరాలు
పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు, తుది నిర్ణయం అప్పుడే
పొత్తుల గురించి ఆలోచించేందుకు ఇంకాసమయం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడుకునే విషయమని చెప్పారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని... నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతీ ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తొలి దశ వారాహి విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలు
స్టార్ హోటల్స్‌తో గ్లోబల్ మ్యాప్‌లోకి గండికోట - సీఎం జగన్
ఏపీలో మూడు చోట్ల ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ తమ స్టార్ హోటల్స్ కట్టడం శుభపరిణామం అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్టార్ హోటల్స్ గ్రూపుల రాకతో గ్రాండ్ క్యానన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తామని అన్నారు. దీంతో గండికోటను ప్రపంచానికి పరిచయం కాబోతోందని అన్నారు. ఒబెరాయ్ లాంటి పెద్ద కంపెనీలు గండికోటలో స్టార్ హోటల్ ఏర్పాటు హర్షణీయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు
1300వ రోజుకు అమరావతి ఉద్యమం - ‘నాలుగేళ్లుగా నరకంలో నవనగరం’ పేరుతో గ్రామస్థుల ఆందోళన
అమరావతి రైతుల ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు నేటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. నేటితో వీరి ఉద్యమం 1300 రోజులకు చేరుకుంది. ఈక్రమంలోనే "నాలుగేళ్లుగా నరకంలో నవనగరం" పేరిట ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మందడంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అమరావతి రైతులు, మహిళలు హాజరయ్యారు. అమరావతి రైతులకు మద్దతుగా తెలంగాణ నుంచి కూడా రైతులు వచ్చారు. 3, 139 మంది అసైన్డ్ రైతులను సీఎం జగన్ ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు, కుట్రలతో రాజధానిని ఆపలేరని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయమే భస్మాసుర హస్తంగా మారుతుందని అన్నారు. పూర్తి వివరాలు