Pawan Kalyan: పొత్తుల గురించి ఆలోచించేందుకు ఇంకాసమయం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడుకునే విషయమని చెప్పారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని... నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతీ ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తొలి దశ వారాహి విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జీలు, పరిశీలకులతో శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్నారు. ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోందన్నారు. పార్టీ ప్రజల్లోనే ఉందని.. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉందని వివరించారు. యాత్రకు జనం వస్తున్నారని.. నాయకత్వం దాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
రూల్ ఆఫ్ లాను వైసీపీ విస్మరించింది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఏ పార్టీ అయినా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పని చేయాలని సూచించారు. వైసీపీ దాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదని.. సీఎం జగన్, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు కాబట్టే మాట్లాడమని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలంతా రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందని గుర్తు చేశారు. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్ధం అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. కొంత మందికి రోజులోనే అర్ధం అయిపోయిందని.. మరికొంత మందికి(70 శాతం మంది ప్రజలకు) ఆలస్యంగా అంటే ఇప్పుడు తెలిసిందంటూ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయిని జనసేనాని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని చెప్పుకొచ్చారు. ఈ అంశం మీద కనీసం రివ్యూ చేసే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. ఇది చాలా పెద్ద సమస్య అని.. అయినా దీని గురించి ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందంటూ పవన్ కల్యాణ్ కామెంట్లు చేశారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే వచ్చే ఎన్నికల తాలూకు ముఖ్య ఉద్దేశం అని వెల్లడించారు.