Telangana Politics : ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ సభకు వచ్చారు. సభలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను ఉందని హెచ్చరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడిస్తామన్నారు. ప్రధాని మోదీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిన మోదీని తన్ని తరిమేస్తారనే ఘాటు ప్రకటనలు చేశారు. హరీష్ రావు దగ్గర్నుంచి జగదీష్ రెడ్డి వరకూ అందరూ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ బీజేపీ - బీఆర్ఎస్ మధ్య యుద్ధం ప్రారంభమయిందా అన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో ఆ ఎఫెక్ట్ అయితే రాకుండా పోయింది.
కేసీఆర్ ఎందుకు స్పందించలేదు ?
గతంలో బీజేపీపై యుద్ధం ప్రకటించినప్పుడు కేసీఆర్ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి కడిగి పారేస్తానని ప్రకటించారు. ఇప్పుడు సందర్భం వచ్చినా కూడా స్పందించడం లేదు. ప్రధాని మోదీ తీ్ర విమర్శలు చేసి వెళ్లిన తర్వాత మహారాష్ట్ర నుంచి తమ పార్టీలోకి చేరడానికి వచ్చిన నేతలకు కండువాలు కప్పేందుకు కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మోదీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే చాన్స్ ఉంది. కానీ కేసీఆర్ మాత్రం స్పందించలేదు. ఇతర పార్టీ నేతలు ఎంత ఘాటుగా స్పందించినా నాయకుడు కేసీఆర్ మాత్రం .. సైలెంట్ గా ఉండటం బీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
బీజేపకి హైప్ ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదా ?
రాజకీయాల్లో రెండు పార్టీల మధ్యే పోటీ ఉందన్న అభిప్రాయం రావాలంటే ఆ రెండు పార్టీలే ఫీల్డ్ లో తలపడాలి. గతంలో బీజేపీ - బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందన్నట్లుగా పరిస్థితి రావడానికి ఇలాంటి రాజకీయాలే కారణం. కారణం ఏదైనా కేసీఆర్ ఇటీవల బీజేపీని విమర్శించడం తగ్గించారు. దీంతో బీజేపీ ఇబ్బంది పడుతోంది. రెండు పార్టీల మధ్య అవగాహన ఉందేమోనన్న ఓ అనుమానాన్ని ప్రజల్లోకి పంపగలిగారు. ఫలితంగా బీజేపీ కి ఇబ్బందికరం అయింది. బీఆర్ఎస్‌కు వచ్చిన నష్టమేం లేదు. కానీ ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత బలపడుతోంది. అయినా సరే మళ్లీ బీజేపీకి హైప్ ఇవ్వడం ఇష్టం లేకనే కేసీఆర్ స్పందించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మోదీ హెచ్చరించినట్లుగా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయా ?
అయితే రెండు పార్టీల మధ్య పోరాటం మళ్లీ ప్రారంభమయిందని..బీజేపీని కూడా కేసీఆర్ ప్రత్యర్థిగా భావిస్తున్నారని అనుకునేలా చేయాలంటే బీజేపీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎన్ని విమర్శలు చేసినా మళ్లీ ఆ ఎఫెక్ట్ రాదు. ప్రధాని మోదీ హెచ్చరించినట్లుగా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడితేనే ఆ ఎఫెక్ట్ మళ్లీ వస్తుందనేది రాజకీయవర్గాల అంచనా. అయితే ఎన్నికలకు ముందు అది బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో సానుభూతి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఆలోచిస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ విషయంలో తగ్గే చాన్సే లేదంటున్న బీజేపీ
అంతర్గత సమస్యలో.. హైకమాండ్ ఢిల్లీ రాజకీయాలో కానీ.. మొత్తంగా బీజేపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం ద్వారా మరిన్ని సమస్యలు తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో రేసులోకి రావాలంటే పరిస్థితులు కూడా కలిసి రావాలి. దీని కోసమే బీజేప ఎదురు చూస్తోంది.