KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన

తెలంగాణలో దళిత బంధు పథకం ఇవాళే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కేసీఆర్ హుజూరాబాద్‌ వెళ్లి 15 మందికి దళిత బంధు చెక్కులు ఇవ్వనున్నారు.

ABP Desam Last Updated: 16 Aug 2021 03:32 PM
ఈసారి వస్తే నాకు చాయ్ పోస్తవా మరి..: కేసీఆర్

కనుకల గిద్ద గ్రామం నుంచి లబ్దిదారులుగా ఎంపికైన కొత్తూరి రాధ-కొత్తూరి మొగిలి అనే కుటుంబానికి సీఎం కేసీఆర్ తొలి దళిత బంధు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తూరి రాధను.. ఈ డబ్బుతో ఏం చేస్తారని సీఎం కేసీఆర్ అడగ్గా.. డెయిరీ ఫాం పెట్టుకుంటానని మహిళ చెప్పింది. దీంతో ఈసారి నేనొస్తే నాకు చాయ్ పోస్తవా మరి.. అని కేసీఆర్ తమాషాగా మాట్లాడారు. ఆ తర్వాత మొత్తం 15 మందికి కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందజేశారు.

వీళ్లందరి పర్యవేక్షణలోనే దళిత బంధు

‘‘ఈ దళిత బంధు ఆశామాషీ కాదు.. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో పాటు దళిత సమాజంలోని పెద్దలు కూడా పర్యవేక్షణ చేస్తుంటరు. దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు వంటి 23 నుంచి 25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నారు. వీరు కాక దళిత బంధు కమిటీలు కూడా వేస్తున్నాం. ప్రతి ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకు 24 మంది మొత్తం కలిపి లక్షకు పైగా కమిటీ మెంబర్లు అవుతరు. 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు, ఈ లక్ష పైచిలుకు కమిటీ మెంబర్లు మొత్తం లక్షా 25 వేల మంది కలిసి ఈ పథకాన్ని పర్యవేక్షణ చేస్తారు. వీరి కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటవుతుంది. అంటే కొన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో ఉంటయ్. దేశంలో ఇంతటి గొప్ప పథకం తొలిసారి జరుగుతుంది. కాబట్టి మీరు మళ్లీ పేదరికంలోకి వచ్చే సమస్య లేనే లేదు.’’ అని కేసీఆర్ చెప్పారు. 

దళిత రక్షణ నిధి మిమ్మల్ని కాపాడుతుంది

‘‘అంతేకాక, దళితుల కోసం రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నం. మీకిచ్చే రూ.10 లక్షల్లో నుంచి మేం ఒక రూ.10 వేలు తీసి పక్కన పెడతం. దానికి ప్రభుత్వం కూడా అంతే కలిపి ఆ డబ్బును రక్షణ నిధి కింద ఉంచుతం. అలా ఒక్క హుజురాబాద్ నుంచే ఆ నిధి దాదాపు రూ.50 కోట్ల అవుతుంది. ఎవరికి ఏదైనా ఆపద వచ్చి మళ్లీ సంక్షోభం వస్తే ఆ నిధి మిమ్మల్ని కాపాడుతుంది.’’ అని కేసీఆర్ వివరించారు.

10 లక్షలు వచ్చినా ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగుతయ్

దళిత బంధు వచ్చిన అందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు, మీకొచ్చే ప్రభుత్వ పథకాలన్నీ అంతే కొనసాగుతయ్. మీరు సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాక అవన్నీ అంతే కొనసాగుతయ్. ఈ పథకం కింద డబ్బులు ఇచ్చి మేం చేతులు దులుపుకోం. మీకు ప్రత్యేకమైన కార్డు ఇస్తాం. పాత అకౌంట్లో వేస్తే పాత బాకీలు పట్టుకుంటారు. ఏడాదికి లక్ష కన్నా విత్ డ్రా చేసుకోకూడదనే ఒక నిబంధన ఉంది. వాటిని అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకొనే వీలు కలగాలంటే.. మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. దానికి తెలంగాణ దళిత బంధు ఖాతా అనే పేరు పెడదాం. మేం ఇచ్చే కార్డు ద్వారా మీరు ఎక్కడెక్కడ ఏం పెట్టుబడి పెట్టారనేది జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటరు. 

లడాయి చేస్తే పైసలు వస్తయా..

‘‘రాష్ట్రమంతా ఈ దళిత బంధు అమలుకు రూ.1.5 లక్షల కోట్లో.. రూ.1.70 లక్షల కోట్లో ఖర్చు అవుతది. అది ఒక లెక్కనే కాదు.. ఏడాదికి రూ.30 వేల కోట్లో నుంచి రూ.40 వేల కోట్లో ఖర్చు పెడితే నాలుగైదేళ్లలో దళితులందరి కల నెరవేరతది. హుజూరాబాద్ కాడ కొంత మంది లడాయి చేసిన్రని తెలిసింది నాకు.. లడాయి చేస్తే పైసలు వస్తయా.. అవసరం అయితే నేనే ఇంకో 20 రోజులకు హుజూరాబాద్ వస్తా. 20 మండలాలు తిరుగుతా. మీతో పాటు దినమంతా గడిపి.. అక్కడే పరిష్కారం చూసుకుందం.’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

పైసలివ్వంగనే ఆగం ఆగం కావద్దు.. మీకు తెల్వకపోతే కలెక్టర్ చెప్తడు :సీఎం

‘‘గోరెటి వెంకన్న రాసిన పాటలో.. ‘మట్టిలోంచి సిరులు తీసే మహిమ నీకు ఉన్నది.. పెట్టుబడే నిన్ను వరిస్తే నీకు ఎదురేమున్నది.’ అని ఉంటది. ఇంకో కవి రాసినట్లు.. ‘చుక్కల ముగ్గు వేసినట్లు చెల్లెలా.. నువ్వు సక్కంగ కూడబెట్టు చెల్లెలా..’ అన్నట్లు మీరు డబ్బులు కూడబెట్టాలె. మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి దీన్ని మీరు విజయవంతం చేయాలె. గవర్నమెంట్‌లో జరిగే కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్లు పెట్టిస్తం. దళిత సోదరులందరికీ మేం మద్దతు ఇస్తం. పైసలివ్వంగనే ఆగం ఆగం కావద్దు. ఎక్కడ పెట్టుబడి పెడితే లాభసాటి ఉంటుందో గుర్తించి ముందడుగు వేయాలి.’’ అని కేసీఆర్ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది: కేసీఆర్

‘‘ఈ దేశంలో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నరు. ఇంత వరకూ ఎవ్వరూ దళితుల గురించి ఆలోచించలేదు. ఒక్కొక్కడు నాకన్నా రెండింతలు ఉన్నరు. ఇంకో రెండు నెలల్లో హుజురాబాద్ ప్రజల కథ అయిపోతది. కానీ, నా కథ అయిపోదు. మీ లాగనే ఇంకా 118 నియోజకవర్గాల్లో అమలు చేయాల. రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉన్నాయి. రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తది. గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్న దళితులకు కూడా దళిత బంధు వస్తుంది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చివరి వరుసలో మీరు దళిత బంధు తీసుకోవాలి. రెక్కాడితేనే డొక్కాడని వాళ్లకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.’’ అని కేసీఆర్ అన్నారు.

సర్కార్ చెయ్యగూసున్నంక.. సీఎం ఇయ్యగూసున్నంక ఏదైనా ఆగుతదా?

‘‘సమగ్ర కుటుంబ సర్వేలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ ఆరేళ్లలో ఇంకో వెయ్యి పెరిగి ఉండొచ్చు. సర్కార్ చెయ్య గూసున్నంక.. సీఎం ఇయ్య గూసున్నంక ఏదైనా ఆగుతదా? రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ ఉంటదా? హుజూరాబాద్ నియోజవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రాబోయే రెండు నెలల్లో దళిత బంధు డబ్బులు ఇస్తాం. ప్రతి ఒక్కరికి దళిత బంధు డబ్బులు అందుతాయి. ఈ పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం.’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

నేను దళిత బంధు ప్రకటించగానే.. పక్కన బాంబులు పడుతున్నయ్

‘‘ఈ దేశంలో ఒక ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ, ఏదైనా నాయకుడు గానీ ఎవరైనా దళితుల గురించి మాట్లాడాడా? దళితులకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరి మదిలోకైనా వచ్చిందా? కనీసం ఆలోచన కూడా రాలే.. నేను అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తున్నా. ఈ పథకం పోయిన ఏడాదే స్టార్ట్ కావాల్సింది. ఇక నేను దళిత బంధు ప్రకటించగానే నాపైన విపక్షాల వాళ్లు అందరూ అరుస్తున్నారు. అంత ఇవ్వాలే.. ఇంత ఇవ్వాలే అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులూ వాళ్లకి ఒక్క పైసా ఇవ్వాలని కూడా అడగనోళ్లు.. ఇప్పుడెందుకు అంటున్నరు. ఒక్కొక్కళ్ల పక్కన బాంబులు పడుతున్నయ్’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

కేసీఆర్.. నీకు తిన్నది అరగదారా..? అని అతను అన్నాడు: సీఎం

దళిత బంధు అనేది ప్రభుత్వ పథకం కాదు. ఇది కచ్చితంగా విజయవంతం అయి తీరుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక జరుగుతున్న ప్రగతి మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఓ మిత్రుడితో మాట్లాడా. ఇదంతా అయ్యేది పోయేది కాదన్నాడు. మొన్న దళిత బంధు మొదలైనప్పుడు కూడా పేపర్లో చూసి అదే మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. అతను నవ్వుకుంటూ.. కేసీఆర్ నీకు తిన్నది అరగదారా.. అని అన్నాడు. ఈ దళిత బంధు ప్రపంచం మొత్తానికి మార్గం చూపిస్తది. నువ్వు చూస్తుండు.. అని నేను అన్నాను.’’ అని కేసీఆర్ ప్రసంగించారు.

అందుకే ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం

‘‘ఈ శాలపల్లి వేదికగానే నేను రైతు బంధు ప్రవేశపెట్టాను. అది విజయవంతంగా కొనసాగుతోంది. కొత్త చరిత్ర సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టాను. ఈ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధనలో సెంటిమెంట్‌గా ఉంది. తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న జిల్లాగా కరీంనగర్ ఉంది. అందుకే దళిత బంధు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నాం.’’ అని కేసీఆర్ అన్నారు.

అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్న‌ ద‌ళిత బంధు పథ‌కం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా శాల‌ప‌ల్లి వేదికపై భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జ‌గ్జీవ‌న్ రాం చిత్ర ప‌టాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం దళిత బంధు వేదికపై ప్రసంగం మొదలుపెట్టారు.

బస్సు యాత్ర ప్రారంభించిన మంత్రి

నిర్మల్ నుంచి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక బస్సులు, వాహనాల్లో తరలి వస్తున్నారు. ఈ బస్సు యాత్రను నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆధ్వర్యంలో కూడా పలువురు కార్యకర్తలు హుజూరాబాద్‌కు బయలుదేరారు. మేడ్చల్ నుంచి మంత్రి మల్లా రెడ్డి భారీ కాన్వాయ్‌తో హుజూరాబాద్‌కు వెళ్తున్నారు. మునుగోడు నుంచి భారీగా దళితులు హుజూరాబాద్‌ సభకు బయల్దేరారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.


Also Read: In Pics: అడుగడుగునా కేసీఆర్, అంబేడ్కర్ కటౌట్లు.. కానీ, ఈ ఫ్లెక్సీ పొరపాటా లేక.. అసలేం జరిగిందో..!

నాడు అంబేడ్కర్ అలా.. ఇప్పుడు కేసీఆర్ ఇలా..: KTR

దళిత బంధు ఇవాళ ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 20వ శతాబ్దంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దళితులకు సామాజిక న్యాయం ద్వారా విముక్తి కలిగించారని, ఇప్పుడు 21వ శతాబ్దంలో కేసీఆర్ దళితులకు ఆర్థిక సాయం ఇచ్చి వారి సాధికారత కోసం కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. ద‌ళితుల కోసం ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం చేపడుతున్న కేసీఆర్‌కు కేటీఆర్ ధ‌న్యవాదాలు తెలిపారు.





భారీ వర్షం పడ్డా దళిత బంధు సభ ఆగదు: హరీశ్ రావు

హుజూరాబాద్‌లోని శాల‌ప‌ల్లిలో జ‌రిగే ద‌ళిత బంధు స‌భకు భారీ వర్షం అడ్డంకి కాదని మంత్రి హరీశ్ రావు అన్నారు. సభ కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం, టెంట్లు అన్నీ జ‌ర్మన్ టెక్నాల‌జీతో తయారైనవని, అవి వర్షాలను కూడా తట్టుకుంటాయని తెలిపారు. బలమైన గాలులు వీచినా, అగ్ని ప్రమాదం జరిగినా తక్కువ నష్టం జరిగేలా ఉండడం దీని ప్రత్యేకత అని అన్నారు. సోమ‌వారం ఉద‌యం మంత్రి హ‌రీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌ హుజూరాబాద్ నేతలతో మాట్లాడారు. ఇప్పటికే గ్రామాలు, ద‌ళిత కాల‌నీల్లోకి బ‌స్సులు చేరుకున్నాయ‌ని, మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు స‌భా ప్రాంగ‌ణానికి అందరూ చేరుకోవాల‌ని మంత్రి హరీశ్ రావు సూచించారు. కాగా, ఈ స‌భ‌కు ల‌క్ష మందికి పైగా ప్రజ‌లు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.


Also Read: In Pics: అడుగడుగునా కేసీఆర్, అంబేడ్కర్ కటౌట్లు.. కానీ, ఈ ఫ్లెక్సీ పొరపాటా లేక.. అసలేం జరిగిందో..!

సీఎం ముందస్తు ప్రణాళిక ఇదీ..

మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగా.. ఒంటి గంటకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరనున్నారు. 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శాలపల్లి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకూ సభలో పాల్గొంటారు. మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమై సాయంత్రం 5 గంటలకల్లా ప్రగతి భవన్ చేరుకుంటారు.

సభా ప్రాంగణంలోకి నీరు

ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న సభా ప్రాంగణం పూర్తిగా సిద్ధం కాగా.. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి లోపలికి నీరు వచ్చింది. స్థానిక మట్టి రోడ్లు కూడా చిత్తడిగా మారాయి. దీంతో అధికారులు లోపలికి వచ్చిన నీటిని తీసేయించారు. బురదగా ఉన్న మట్టి రోడ్డును సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

Background

తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు. ఇప్పటికే అక్కడ సభా ప్రాంగణం సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేదికపైనుంచే కేసీఆర్ 15 మందికి తొలుత దళిత బంధు చెక్కులను అందజేస్తారు. అందుకోసం ఇప్పటికే ఆ 15 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. సభా ఏర్పాట్లను ఇదివరకే మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటివారు పరిశీలించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.