Sunny Leone Got Thousand Rupees Under Chattisgarh Scheme: ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకానికి సంబంధించి లబ్ధిదారుల్లో బాలీవుడ్ నటి సన్నీలియోని (Sunny Leone) పేరు ఉండడంతో అధికారులు షాకయ్యారు. ఆమె పేరు మీద ఉన్న ఖాతాలోకి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.1000 జమవుతున్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. ఓ వ్యక్తి దీని వెనుక ఉండి ఈ తతంగం నడిపించాడని గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం 'మహతారీ వందన్ యోజన' (Mahatari Vandan Yojana) పథకం కింద రాష్ట్రంలోని వివాహిత మహిళలకు ప్రతీ నెలా వారి అకౌంట్లలో రూ.1000 జమ చేస్తోంది. అయితే, ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటి సన్నీలియోని పేరుతో ఓ అకౌంట్‌ను చూసిన అధికారులు కంగుతిన్నారు. దీనిపై విచారణ చేయగా.. బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి నటి పేరుతో ఫేక్ బ్యాంక్ అకౌంట్ తెరిచి.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ప్రతీ నెలా ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.1000 లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. గత మార్చి నెల నుంచి నగదు జమ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశామని.. పథకంలో అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారులను కూడా విచారిస్తున్నామని వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని సదరు బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. ఇప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని నిందితుని నుంచి వసూలు చేయాలని స్పష్టం చేశారు.
బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు
మరోవైపు, ఈ ఘటనపై విపక్ష కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో మహతారీ వందన్ యోజన కింద 50 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల ఫేక్‌వేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను డిప్యూటీ సీఎం అరుణ్ సావో తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలో అందించని సాయం ఇప్పుడు రాష్ట్ర మహిళలు అందుకుంటున్నారని.. దీంతో ఆ పార్టీ ఓర్వలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితునిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.