Kishan Reddy : రికమెండేషన్లకు తలొగ్గకుండా ప్రతిభ క‌లిగిన వారికే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామ‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 71వేల మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. పూర్తి పారదర్శక విధానంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని, దళారుల మాట విని మోసపోవద్దని సూచించారు. కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన 526 మందికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. 


నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఇప్పటివరకు 10 రోజ్ గారి మేళాలు పూర్తయ్యాయని, ఇది 11వ మేళా అని చెప్పారు. ఈ కార్యక్రమంతో సుమారుగా 10లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలని, ఖాళీలు ఉండొద్దని ప్రధాని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగేదని, కానీ ఇప్పుడు మాత్రం పూర్తి పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. 


తక్కువ ఖర్చుతో నెట్ సర్వీసెస్


కరోనా మహమ్మారితో చాలా దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో తయారవుతోన్న మొబైల్ ఫోన్లు అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయన్నారు. దేశంలో 5జీ సేవలు రెట్టింపవుతున్నాయని, కానీ ఇప్పటికీ చాలా దేశాల్లో 5జీ లేదని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో నెట్ సేవలు అందిస్తోన్న దేశం మన దేశమని కొనియాడారు. మన దేశ యువత అతి తొందర్లోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


అల్లు అర్జున్ ఇంటిపై దాడి


అంతకుముందు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని కిషన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు అల్లు అర్జున్ నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి, భద్రతల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఈ ఘటన పౌరుల భద్రత, శాంతి భద్రతలను రక్షించడంలో కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రతిబింబిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఈ ఘటన కాంగ్రెస్ కు మద్దతుగా జరిగిందా లేదంటే.. స్పాన్సర్డ్ గా జరిగిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.





Also Read : Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్