Accused gets bail in Allu Arjun House Attack Case | హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలు (OU JAC Leaders)ను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరు పరిచారు. ఆరుగురు నిందితులకు ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.
ఆదివారం నటుడి ఇంటిపై దాడి
ఓయూ జేఏసీ నేతలు ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఇంటి మీద టమాటాలు విసరడంతో పాటు పూలకుండీలు ధ్వంసం చేసి రచ్చరచ్చ చేశారు. దాంతో అల్లు అర్జున్ నివాసం వద్ద ఆ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి బోనాల నాగేశ్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజుగౌడ్, ఛైర్మన్ రెడ్డిశ్రీను ముదిరాజ్, కన్వీనర్ పి.ప్రకాశ్, నేత మోహన్, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర కార్యదర్శి బుద్దా ప్రేమ్ కుమార్ గౌడ్, పి. ప్రకాశ్ తదితరులు నటుడి ఇంటి వద్దకు చేరుకుని అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్, అమెరికాకు శ్రీతేజ్‌ను పంపాలి
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు నేతలు ప్రహరీ ఎక్కి నటుడి ఇంట్లోకి టమాటాలు విసిరారు. అంతటితో ఆగకుండా పూల కుండీలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ పరామర్శించి వారికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీతేజ్ ను అమెరికాకు పంపించి మెరుగైన వైద్య చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ నేతలు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి దూసుకురావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నటుడి సెక్యూరిటీ సిబ్బందికి, జేఏసీ నేతలకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.