Sandhya Theatre Stampede Incident | హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌దే తప్పిదమని పోలీసులు చెబుతుంటే.. కాదు పోలీసులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగతంగా తనను దిగజార్చే ప్రయత్నం జరుగుతుందని నటుడు, ఆయన కుటుంబం చెబుతోంది. ఈ క్రమంలో ఆదివారం సైతం తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand), ఏసీపీ పలువురు ఆ ఘటనపై కామెంట్స్ చేశారు.


హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు
సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట మహిళ మృతి కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఆరోజు ఏం జరిగిందో పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా సీవీ ఆనంద్‌ను కొన్ని విషయాలు ప్రశ్నించగా.. నేషనల్ మీడియాను కొనేశారు. అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా, అందుకు మీతో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సీవీ ఆనంద్ పై అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. దాంతో దిగొచ్చిన ఐపీఎస్ సీవీ ఆనంద్ తమ మాటలు వెనక్కి తీసుకున్నారు. జాతీయ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.






జాతీయ మీడియాపై తనను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశాంతతను కోల్పోయి వ్యాఖ్యలు చేశాను. అందుకుగానూ క్షమాపణలు కోరుతున్నాను. పరిస్థితి ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసిన తప్పిదంగా భావించి, నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి వివాదానికి స్వస్తి పలికారు. 


అల్లు అర్జున్ పోలీసుల మాట వినకుండా సినిమా చూశారు


థియేటర్‌లో సినిమా చూస్తున్న అల్లు అర్జున్‌కు పోలీసులు విషయం చెప్పారు. అయినా ఆయన సినిమా చూస్తూనే కూర్చున్నారు. ఏసీపీ చెబితే వినకపోవడంతో డీసీపీ వెళ్లి గట్టిగా చెప్పడంతో అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వెళ్లారు. పోలీసులు తనను థియేటర్ నుంచి బయటకు తీసుకెళ్లలేదని చెప్పడంలో వాస్తవం లేదు. అల్లు అర్జున్‌కు రూట్ క్లియర్ చేస్తూ ఆయన అక్కడి నుంచి పోలీసులు పంపిస్తున్న వీడియోలను విడుదల చేశారు. ప్రైవేట్ బౌన్సర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసులను సైతం నెట్టివేస్తున్నారు. ఇలాంటివి జరిగితే చర్యలు తీసుకుంటాం. తాను వెంటనే సంధ్య థియేటర్ నుంచి వెళ్లిపోయానని అల్లు అర్జున్ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ 10 నిమిషాల వీడియో రిలీజ్‌ చేశారు. 



Also Read: CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్