CM Revanth Reddy Tweet On Attack On Allu Arjun's House: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని.. ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర సీపీని ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అటు, సంధ్య థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
హైదరాబాద్ అల్లు అర్జున్ నివాసంపై ఆదివారం సాయంత్రం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు. బన్నీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటి బయట బైఠాయించారు. కొందరు గోడలు ఎక్కి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. కొందరు గోడ దూకి ఇంటి ఆవరణలోని పువ్వుల కుండీలను ధ్వంసం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. జేఏసీ నేతలు 8 మందిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. కాగా, దాడి సమయంలో బన్నీ ఇంట్లో లేరు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీ నివాసానికి చేరుకుని ఘటన వివరాలను సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బన్నీ పిల్లలను కారులో తన ఇంటికి తీసుకెళ్లారు.
'సంయమనం పాటిస్తున్నాం'
మరోవైపు, తన ఇంటిపై ఓయూ విద్యార్థుల జేఏసీ చేసిన దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. ఈ సమయంలో అందరూ సంయమనం పాటించాలని.. అదే అందరికీ మంచిదని అన్నారు. 'ఆదివారం సాయంత్రం మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటింటాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. ఇంటి ముందు ఆందోళన చేసిన వారిని పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వచ్చారు కదా అని.. ఈ ఘటనపై మేము స్పందించం. ఇలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు' అని విజ్ఞప్తి చేశారు.
Also Read: Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు