Telangana Police Sensational Comments On Allu Arjun: ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ (Sandhya Theater) తొక్కిసలాట ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో దీనికి సంబంధించి పలు వీడియోలు విడుదల చేశారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలను చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపు తప్పిందని అల్లు అర్జున్‌కు (Allu Arjun) చెప్పినా సినిమా చూశాకే వెళ్తానని బన్నీ చెప్పినట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే.?
'అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌ను కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి అదుపు తప్పింది. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని సూచించాం. అయినా.. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి జరిగిన విషయం బన్నీకి చెప్పాం. మీకు అధికారులంతా సహకరించి రూట్ క్లియర్ చేశారు. దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పాను. ఆయన సినిమా చూశాకే వెళ్తానని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే డీసీపీకి చెప్పాం. ఆయన.. మేము లోపలికి వచ్చి 10 నిమిషాల టైం ఇచ్చాం. ఆ తర్వాత అల్లు అర్జున్ను బయటకు తీసుకొచ్చాం. మేం లోపలికి వెళ్లే వీడియోలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో మాట్లాడే ఫుటేజ్ కోసం ట్రై చేశాం. కానీ దొరకలేదు.' అని ఏసీపీ తెలిపారు. అటు, అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఆయన మేనేజర్ ఒప్పుకోలేదని.. అక్కడి నుంచి బన్నీ వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పినట్లు చిక్కడపల్లి ఎస్హెచ్ఓ స్పష్టం చేశారు.
'న్యాయ సలహాతో ముందుకెళ్తాం'
అటు, సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానమిచ్చారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని ఆయన విడుదల చేశారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా.. మిస్ బిహేవ్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీపీ హెచ్చరించారు. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనన్నారు. ప్రజలకు ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత కూడా వీఐపీలదే అని స్పష్టం చేశారు.
ఆ వీడియోలు వైరల్
కాగా, థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన సమయంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్ వద్ద ఘటన జరిగిన సమయంలో సినిమా హాల్ నుంచి బన్నీని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. మరోవైపు, అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఓయూ జేఏసీ నాయకులు బన్నీ ఇంటిని ముట్టడించి రాళ్లు రువ్వారు. రేవతి మృతికి బన్నీనే కారణమని నినాదాలు చేశారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. రాళ్లు బన్నీ ఇంటి ఆవరణలో పువ్వుల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు.