Police will issue another notice to Perni Nani In Machilipatnam house | మచిలీపట్నం: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన గోదాముల్లో క్వింటాళ్ల కొద్దీ బియ్యం మాయం కావడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇంకా దాగుడుమూతలు కొనసాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్ 10న పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసరఫరాలశాఖ అధికారి ఫిర్యాదు మేరకు పేర్ని జయసుధతో పాటు గోదాముల మేనేజర్ మానస తేజపై కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 24కి వాయిదా పడింది.
నిన్న ముగిసిన డెడ్‌లైన్
గోదాముల్లో భారీ ఎత్తున బియ్యం మాయం అయిన కేసులో వివరాలు సమర్పించాలని, వివరణ ఇచ్చుకునేందుకు పేర్నినానికి, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు రాబర్ట్ సన్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలలోగా పీఎస్‌కు వచ్చి వివరాలు సమర్పించాలని శనివారం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం ఇంటికి నోటీసులు అంటించినట్లు తెలుస్తోంది. అయితే గడువు ముగిసినా పేర్నినాని గానీ, ఆయన కుమారుడు గానీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు, వివరాలు సమర్పించకపోవడంతో మాజీ మంత్రి ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్ అవుతోంది. రెండు వారాల కిందట పేర్ని జయసుధపై బియ్యం మాయం కేసు నమోదైన సమయంలోనూ కొన్నిరోజులు పేర్ని నాని ఆజ్ఞాతంలోకి వెళ్లారు. తరువాత బయటకు వచ్చి మచిలీపట్నం వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
ఏ2 ఆచూకీ సైతం లభించడం లేదు
అందుబాటులో ఉన్న సమయంలో నోటీసులు ఇవ్వని పోలీసులు, ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం లేని సమయంలో వెళ్లి నోటీసులు ఇవ్వడంపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజ ఆచూకీ సైతం పోలీసులకు లభ్యం కావడం లేదు. కుటుంబసభ్యులు, స్నేహితులను విచారించినా ప్రయోజనం లేకపోయింది.
ఎవరినీ వదిలిపెట్టేది లేదన్న మంత్రి నాదెండ్ల
ఇటీవల ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పేర్ని జయసుధకు చెందిన గోదాములో 3 వేల బస్తాలు కాదు, 4840 బస్తాలు మాయం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత 1300 రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మార్చుతాం. ఆ బియ్యాన్ని గోడౌన్లలో భద్రపరుస్తాం. రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లకు ప్రభుత్వం ఆ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. అయితే నవంబర్ 26న ప్రభుత్వం “వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్” సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. దాని ద్వారా గోదాముల్లో బియ్యం నిల్వలు అక్కడికి వెళ్లకుండానే తెలుసుకోవచ్చు.
గోదాము యజమానులకు ట్రైనింగ్ ఇచ్చాం. ఆ మరుసటిరోజే బియ్యం తగ్గిందని పేర్ని జయసుధ గోదాము నుంచి లేఖ వచ్చింది. తగ్గిన బియ్యానికి లెక్క చెబితే నగదు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు. డబ్బుల గురించి ఎవరూ చూడటం లేదు. జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుని పేదలకు బియ్యం అందేలా చేయడం ప్రభుత్వం ఉద్దేశం. బియ్యం ఎక్కడికి తరలిపోయిందనే దానిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అన్నారు.