విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాలలకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read: YS Sharmila: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కొప్పు రాజు కుటుంబంతో షర్మిల
విద్యాసంస్థలదే తుది నిర్ణయం
తెలంగాణలో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కొవిడ్ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ బోధనపై విద్యాసంస్థలకే పూర్తి నిర్ణయాధికారాన్ని ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించాలనుకునే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీచేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. స్కూళ్లలో పాటించే కోవిడ్ మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని విద్యాశాఖకు సూచించింది.
Also Read: SmartPhones in September: సెప్టెంబరులో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..
కోవిడ్ మూడో దశ
రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయని వెల్లడించింది. బడులు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలు ఉన్నాయనని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలని సూచించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.
Also Read: AP New Medical Policy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... కొత్త వైద్యులకు మూడేళ్ల ప్రొబేషన్... !