రేపటి నుంచి సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఆగస్టులో వరుస లాంచ్‌లతో అదరగొట్టిన మొబైల్ కంపెనీలు.. సెప్టెంబరులో కూడా మరిన్ని కొత్త మోడల్స్ ను విడుదల చేయనున్నాయి. మరి సెప్టెంబర్ నెలలో ఏమేం స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయో చూద్దామా? 
రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime):



ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్‌ రానుంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్‌ 3న మధ్యాహ్నం 12 గంటలకు మన దేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. షియోమీ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన రెడ్‌మీ 10కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో ఇది పనిచేయనుంది. దీనిలో మెయిన్ కెమెరా కెపాసిటీ 50 మెగాపిక్సెల్‌గా ఉంది. వెనుకవైపు నాలుగు క్వాడ్ కెమెరాలు అందించారు. 6.5 అంగుళాల అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే ఉండనుంది. 90 HZ రిఫ్రెష్ రేట్ అందించారు. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లతో ఈ ఫోన్ రానుంది. రెడ్‌మీ 10 ప్రైమ్ ధర రూ.10 వేల నుంచి రూ.11 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. 


జియో ఫోన్ నెక్ట్స్ (Jio Phone Next)



ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ ఫోన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న జియో ఫోన్ నెక్స్ట్.. సెప్టెంబర్ 10న లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ధర రూ.3000 నుంచి రూ.4000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఇందులో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. దీనిలో 720x1,440 పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్ ఉండనుంది. జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ, 3 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌తో ఇది రానుంది. 
శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ (Samsung Galaxy A52s 5G)



శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ మనదేశంలో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. గత వారంలో యూకేలో లాంచ్ అయిన ఈ ఫోన్‌.. ఇండియాలో రేపు ఎంట్రీ ఇవ్వనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందించారు.  


రియల్‌మీ 8ఐ (Realme 8i)



రియల్‌మీ నుంచి రియల్‌మీ 8ఐ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. రియల్‌మీ 8 సిరీస్‍లో ప్రస్తుతం రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో, రియల్‌మీ 8 5జీ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ ఫోన్లను తీసుకురానున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. వీటి స్పెసిఫికేషన్లు మాత్రం వెల్లడించలేదు. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోనుకు ఈ పోటీగా 8ఐ రానుందని తెలుస్తోంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ అందించనున్నారు. మెయిన్ కెమెరా కెపాసిటీ 50 మెగాపిక్సెల్ ఉండనుంది. 
ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 series)



ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నాయి. వీటికి సంబంధించిన లాంచ్ తేదీ అధికారికంగా విడుదల కానప్పటికీ పలు టెక్ సంస్థలు లీకులను అందించాయి. వీటి ప్రకారం చూస్తే.. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 14న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 13 సిరీస్‌‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ అనే 4 మోడల్ ఫోన్లను విడుదల చేసే ఛాన్స్ ఉంది. వీటి ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. 
అసుస్‌ 8జెడ్‌ (Asus 8Z) 
అసుస్ 8జెడ్‌ పేరుతో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్‌ సెప్టెంబర్ నెలలో ఇండియా మార్కెట్లోకి రానుంది. స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌తో ఇది పనిచేయనుంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ అందించారు. 5.9-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. వెనకవైపు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అందించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 


Also Read: What3Words App: భూమిపై ప్రతి 3 మీటర్లకో మూడు పదాలు.. ఈ యాప్ తో ప్రపంచంలో ఏ ప్లేస్ కైనా ఈజీగా వెళ్లొచ్చు


Also Read: Google Bans 8 Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ క్రిప్టోకరెన్సీ యాప్స్ ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేసుకోండి.. ఎందుకంటే..!