తెలంగాణలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో సీజనల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో జనం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అసలే కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదిలిపోనందున ఈ జ్వరాలతో ఏది ఏ తరహా జ్వరమో తెలియక జనం తికమక పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ దీనిపై స్పందించారు. ప్రస్తుతం ప్రబలుతున్న జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తరపున ఇప్పటికే దోమలు, లార్వా నాశనం చేసేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.


ఈ వర్షాకాలంలో ప్రబలుతున్న సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో డెంగీ కేసులు కూడా నమోదైనట్లు గుర్తించామని శ్రీనివాస్ వివరించారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,200 డెంగీ కేసులను గుర్తించామని, మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు వచ్చినట్లుగా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో తెలంగాణ ఉచిత డయాగ్నోస్టిక్‌ సెంటర్లు నడుస్తున్నాయని డీహెచ్‌ తెలిపారు.


Also Read: Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్


రెండో వేవ్ ముగిసినట్లే..
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు ఓ మోస్తరుగా అదుపులోకి వచ్చినందున కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని శ్రీనివాసరావు తెలిపారు. అన్ని జ్వరాలను కొవిడ్‌ జ్వరాలని అనుకోవడానికి లేదని సూచించారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే తొలుత పరీక్షలు చేయించుకోవాలని, జ్వరంతో పాటు కళ్లు తిరగడం, నీళ్ల విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్‌లెట్ ఎక్స్‌ట్రాక్షన్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచామని.. పెద్ద ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లీనిక్ వంటివాటిని కూడా ఏర్పాటు చేశామని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 0.7 శాతంగా ఉందని, పోస్ట్ కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వారు ఎక్కువగా ఉన్నారని శ్రీనివాస్ తెలిపారు.


వ్యాక్సిన్ 1.65 కోట్ల మందికి..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్లుగా డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించారు. 34 శాతం మందికి రెండు డోసులు పూర్తయినట్లుగా చెప్పారు. హైదరాబాద్‌లో దాదాపు 100శాతం మందికి.. జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఓ డోస్‌ పూర్తి చేశామని తెలియజేశారు.


Also Read: Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్