మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలవడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య కేసుకు సంబంధించి గత రెండు రోజులుగా పులివెందుల ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులను సీబీఐ విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడయ్యాయా? పురోగతి ఏంటనే విషయాలు తెలుసుకునేందుకు సునీత సీబీఐ అధికారులను కలుసుకున్నట్లుగా సమాచారం.
73వ రోజుకు చేరిన విచారణ..
వివేకా హత్య కేసు విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కేసు విచారణ జరిపేందుకు పులివెందులకు వచ్చిన అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. దీనిలో భాగంగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సునీల్ యాదవ్ సమీప బంధువు భరత్ యాదవ్‌ను అధికారులు విచారిస్తున్నారు. భరత్ తో పాటు పులివెందులకు చెందిన నాగేంద్ర, మహబూబ్ బాషా సహా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తి కూడా ఈ విచారణకు హాజరయ్యారు.
Also Read: Viveka Cbi : కడప ఎంపీ తండ్రిని ప్రశ్నించిన సీబీఐ ! తర్వాత ఎవరు..?
సుంకేసులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని కూడా ఈరోజు విచారణకు పిలిచినట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి గతంలో వివేకా పొలం పనులు చూసేవాడు. కడప ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిలను మరోసారి ఈ రోజు విచారణకు పిలిచింది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వీరిని విచారించనుంది.
నిన్న ఎవరెవరిని విచారించారు?
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వైఎస్ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. మంగళవారం సీబీఐ టీం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించింది. సీబీఐ రెండు టీములుగా మారి ఈ కేసును విచారిస్తోంది. ఒక టీమ్ కడపలో... మరో టీమ్ పులివెందులలో ఉండి అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది. సునీల్ కుమార్ యాదవ్‌ను కస్టడీలోకి తీసుకుని వివరాలు రాబడుతోంది. ఇక్కడ రాబట్టిన వివరాలను బట్టి పులివెందులలో రెండో బృందం.. ఇతర అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వివేకా హత్య జరిగినప్పుడు ఆయన ఇంటి వద్దకు మొదటగా వెళ్లిన వ్యక్తుల్లో భాస్కర్ రెడ్డి ఒకరన్న ప్రచారం ఉంది. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది.