వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. హత్య కేసులో అనుమానితులను విచారిస్తోంది. ఇప్పటికే అనుమానితుడిగా భావిస్తోన్న సునీల్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ.. హత్యకు వాడిన మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. ఈ తరుణంలో వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీకి లేఖ రాశారు. ఈ లేఖపై కలకలం రేగుతోంది. తమ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తి తిరుగుతున్నట్లు సునీత కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు లేఖ రాశారు. ఈ నెల 10న సాయంత్రం 5 గంటల సమయంలో పులివెందులలోని తన ఇంటి వద్ద ఓ అనుమానితుడు రెక్కీ చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. రెండుసార్లు బైకుపై ఇంటి పరిసరాల్లో తిరిగినట్లు తెలిపారు. రెక్కీ నిర్వహించిన విషయాన్ని సునీత, ఆమె కుటుంబ సభ్యులు సీసీ కెమెరాల్లో గుర్తించారు.


వైసీపీ నేత అనుచరుడిగా గుర్తించిన పోలీసులు 


ఈ ఘటనపై సునీత గురువారం పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ వివేకా ఇంటికి వచ్చి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇంటి వద్ద రెక్కీ చేసిన వ్యక్తిని పోలీసులు మణికంఠరెడ్డిగా గుర్తించారు. ఆ వ్యక్తి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడిగా  తేల్చారు. ఇటీవల జరిగిన శివశంకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మణికంఠరెడ్డి పులివెందులలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అంశాన్ని వివేకా కుమార్తె సునీత లేఖలో పేర్కొన్నారు. మణికంఠరె‌డ్డిని విచారించిన అనంతరం ఫ్లెక్సీలు తొలగించారని శుక్రవారం కడప ఎస్పీ అన్బురాజన్‌కు సునీత ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆ లేఖను ఎస్పీ కార్యాలయంలో ఇచ్చారు. 
Also Read: Viveka Murder Case: మా ఇంటి చుట్టూ అనుమానితులు తిరుగుతున్నారు.. భయంగా ఉంది.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ


సునీత లేఖపై స్పందించిన ఎస్పీ


వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన అనుమానితుడుగా ఉన్నారని, అతడు తనకు ముప్పు తలపెట్టే అవకాశం ఉందని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాలున్న పెన్‌ డ్రైవ్‌ ను ఎస్పీకి అందజేశారు. ఈ లేఖను డీఐజీ, సీబీఐ అధికారులకు కూడా పంపినట్లు తెలిపారు. పులివెందులలో తమ ఇంటి వద్ద పోలీసు భద్రత కల్పించాలని ఆమె కోరారు. సునీత లేఖపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. వివేకా ఇంటి వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేశాలని ఆదేశాలు జారీచేశారు. ఇతర అంశాలపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని పులివెందుల డీఎస్పీని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వివేకా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటుచేశామని పులివెందుల సీఐ తెలిపారు. 


కొనసాగుతున్న విచారణ


వైఎస్‌ వివేకా హత్యకేసులో 69వ రోజూ సీబీఐ విచారణ చేస్తోంది. పులివెందుల ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో జరుగుతోన్న విచారణకు తుమ్మలపల్లి యురేనియం కర్మాగార ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి చాలా సన్నిహితుడుఉదయ్‌కుమార్‌రెడ్డి తండ్రి ప్రకాశ్‌రెడ్డిని, పులివెందులకు చెందిన బాబురెడ్డి దంపతులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. కడపలో జరుగుతున్న విచారణకు సునీల్ బంధువు భరత్ యాదవ్‌ హాజరయ్యారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా దర్యాప్తు అధికారులు విచారణకు హాజరవ్వాలని పిలిచారు. 
Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు


పోలీసుల అదుపులో మణికంఠ రెడ్డి


వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు మేరకు... మణికంఠ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానందరెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్టు మణికంఠ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వివేకా హత్య కేసు నిందితులతో తనకు ప్రాణహాని ఉందని సునీత కడప ఎస్పీ అన్బురాజన్ కు లేఖ రాశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఈ రోజు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకుని పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు విచారణ చేస్తున్నారు.


Also Read: Bhimavaram Blast: భీమవరంలో వరుస పేలుళ్లు.. సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందు ఘటనలు.. హైటెన్షన్ లో జిల్లా యంత్రాంగం