వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ఒక్కో ఎల్‌పీజీ (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్‌కు రూ.25 చొప్పున ఎగబాకింది. ఇప్పటికే అధిక రేట్లతో సతమతం అవుతున్న సామాన్యుడికి ఇది పిడుగులాంటి వార్తే. ఈ ధరలు ఆగస్టు 17 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగినా.. ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంది. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన వేళ హైదరాబాద్ రూ.887, ఢిల్లీ, ముంబయిలో ఒక సిలిండర్ ధర రూ.859.50గా ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.886కి చేరింది. చెన్నైలో రూ.850.50, బెంగళూరులో రూ.837.50 ఉంది. ఇప్పటికే గత జులై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే.
Also Read: Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వాలు విధించే పన్నులు కలిపి మొత్తం ధర తడిసిమోపెడు అవుతోంది. మరోవంక దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయిలో మోతమోగుతున్నాయి. అదే టైంలో వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా సామాన్యుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 వరకు సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది.
గతంలో పెరిగిన సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. తాజాగా ఈ ఆగస్టు 1న గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. దాని ప్రకారం.. ఎల్‌పీజీ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.73.5 పెంచాయి. అయితే ఇంటి అవసరాల కోసం వాడే 14.2 కిలోల సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. జులై 1న ఇంటి అవసరాల కోసం వాడే 14.2 కిలోల సిలిండర్ ధరను రూ.25.50 పెంచారు. 2021 ఏడాది తొలి నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 వరకు పెంచారు.
ఈ ఏడాది జనవరి 1న 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉండేది. ఇప్పుడు చూస్తే రూ.850 దాటింది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. 14.2 కిలోల డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంటే... ప్రస్తుతం అది కనీసం రూ.834.50కు ఎగబాకిపోయింది.
Also Read: Tamilisai Mother Passed Away: గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం