దాదాపు రూ.500 కోట్లతో విస్తరణ ప్రణాళికలపై ప్రకటన
నెల రోజుల కిందనే హైదరాబాద్ లో యూనిట్ ను ప్రారంభించిన కంపెనీ
ఇప్పుడు మరో అదనపు యూనిట్ కోసం ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయం
దావోస్ లో మంత్రి కేటీఆర్‌తో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధుల సమావేశం
తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయం తీసుకుంది. సుమారు 500 కోట్లు (60 మిలియన్ యూరోలతో) విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీర్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో మరో సక్సెస్ సాధించారు. భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ప్రకటించింది. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్ పెంటసా (pentasa) ను ఇక్కడ నుండి ఉత్పత్తి చేసేందుకు ఈ నూతన ప్లాంట్ ను వినియోగించుకున్నట్లు కంపెనీ బుధవారం తెలిపింది.
ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్, అక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్- API తయారీదారుల్లో ఒకటిగా ఉన్న స్విస్ ఫార్మా దిగ్గజం ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం తెలిపింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, అల్లేసండ్రో గిలియో( Mr. Alessandro Gilio) ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు.
ఫెర్రింగ్ ఫార్మా పెట్టుబడులపై కేటీఆర్ హర్షం
స్విట్జర్లాండ్ కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాదులో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో తన విస్తరణకు పెట్టుబడి పెడుతున్న ఫెర్రింగ్ ఫార్మా కి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్ ను హైదరాబాద్ లో ప్రారంభించిందని, ఇంత తక్కువ సమయంలో కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.500 కోట్లు) పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఫెర్రింగ్ ఫార్మా నిరూపించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమైందని కేటీఆర్ అన్నారు.