కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లా అని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే మహానేత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను కేవలం జిల్లాకు పరిమతం చేశారని పవన్ పేర్కొన్నారు. సదుద్దేశంతో జిల్లాలకు మహా నేతల పేర్లు పెడితే ఈ పరిస్థితి రాదన్నారు. అనంతపురం జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంతో చాలా మంది వ్యతిరేకించారని పవన్ గుర్తుచేశారు. మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మహానాయకులను కేవలం ఒక్క జిల్లాకు పరిమితం చేస్తున్నారని కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారని.. ఒకవేళ విధ్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం లేకపోతే జిల్లాల పేర్లు పెట్టే సమయంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రయోజనం ఉండేదని ఇంత వ్యతిరేకత వచ్చేది కాదన్నారు. 


బాధితులను న్యాయం చేయకుండా అలాంటి కామెంట్లా ? 
మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నిందితులను శిక్షించడం, బాధితులకు అండగా నిలబడేందుకు బదులుగా ఏపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. అత్యాచారం జరిగిన మహిళకు అండగా నిలవకుండా, తల్లుల పెంపకం బాగోలేకపోతే ఇలా జరుగుతాయని హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలన్ని ఈ సందర్భంగా జనసేనాని గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. పలమనేరులో టెన్త్ విద్యార్థినిపై వేధింపులు జరిగితే ఆత్మహత్య చేసుకుంది. 


విశాఖపట్నంలో ఓ అధికారిని వైఎస్సార్‌సీపీ నేతలు కొట్టినా అధికారిదే తప్పు అంట. వీరికి వ్యతిరేకంగా తీర్పు వస్తే న్యాయమూర్తులు, జడ్జీలదే తప్పు అని విమర్శలు చేస్తారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే, మానసికంగా చిద్రవధ చేసి ఆయన చనిపోయేలా చేశారు. మత్స్యపురిలో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి సర్పంచ్‌గా గెలిచిన జనసేన మహిళా నేత ఇంటిపై దాడి చేసి వైసీపీ నేతలు కూల్చేశారు. 


కేంద్ర మంత్రి రాంనాథ్ అథవాలేను బీఎస్పీ నేతలు అడిగిన ప్రశ్నకు.. దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపులు అధికంగా జరిగిన రాష్ట్రం ఏపీ అని సమాధాన మిచ్చారు. 5,857 దుర్ఘటనలు ఎస్సీ, ఎస్టీలపై జరిగాయన్నారు. వరప్రసాద్ అనే దళిత యువకుడికి వైసీసీ నేతలు శిరోముండనం చేయించారని, తాను ఈ సమాజంలో బతకలేనని నక్సలైట్ గా బతికేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు లేఖ పెట్టారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ
ఎస్సీల్లో వ్యతిరేకత ఉందని దీన్ని మళ్లించడంలో భాగంగా వాళ్ల ఇళ్లపై వాళ్లే దాడులు చేయించుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. దాడులు జరుగుతాయని తెలిస్తే పోలీసులను భారీగా ఎందుకు మోహరించలేదని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే కోనసీమ జిల్లాల్లో దాడులు జరిగాయని ఆరోపించారు. కోడికత్తి కేసుల ఎటు పోయింది, విచారణ ఎంత వరకు వచ్చిందో హోం మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ అనుమానాలు తొలగిపోలేదన్నారు. ఓరోజు గుండెపోటు అన్నారు. ఓ రోజు హత్య అన్నారు. గొడ్డలితో హత్య జరిగిందని ఆరోపణలున్నాయి. కానీ ఇప్పటికీ ఏ విషయం తేల్చకపోవడాన్ని ప్రస్తావించారు. ఏపీ పోలీసులను నమ్మలేమని సీఐఎస్ఎఫ్ సైతం వ్యాఖ్యానించినట్లు పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.


Also Read: Pawan Kalyan On Konaseema Violence: ఎమ్మెల్సీ డ్రైవర్‌ హత్య కేసును కవర్ చేసుకునేందుకు ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది : పవన్ కళ్యాణ్ ఆరోపణలు


Also Read: 3 Years of YSR Congress Party Rule : మూడు రాజధానులు టు రివర్స్ టెండరింగ్ - మూడేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ !