ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మూడేళ్ల కాలంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అవి రాష్ట్ర గతినే మార్చేసేవి. అలాంటి వాటిలో మొదటిది మూడు రాజధానుల నిర్ణయం. అమరావతిని కేవలం న్యాయరాజధానిగా ఉంచి..విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గాచేయాలని తీసుకున్న నిర్ణయంతో జగన్ సంచలన నిర్ణయాలు ప్రారంభమయ్యాయి.


మూడు రాజధానుల నిర్ణయం ! 


రాష్ట్ర విభజన తర్వాత మొదటి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడింది. ఆ ప్రభుత్వం విస్తృత సంప్రదింపుల తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. ఆ సమయంలో రాజధానిగా అమరావతి వద్దు అని ఎవరూ చెప్పలేదు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ కూడా అమరావతిని స్వాగతించారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి  అవసరం కాబట్టి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు.  2020లో ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు.  విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా చేయాలని బిల్లులో పేర్కొన్నారు.  సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.   అమరావతికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే తర్వాత హైకోర్టులో కేసుల వల్ల ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు అమలులో లేదు. సంచలన నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకూ మూడు రాజధానుల వైపు అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.


అమరావతి పనుల నిలిపివేత !


మూడు రాజధానుల్లో ఒక రాజధానిగా అమరావతిని ఖరారు చేసినప్పటికీ.. అక్కడ జరుగుతున్న పనుల్ని ప్రభుత్వం నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  25 శాతంలోపు పూర్తయినవి మాత్రమే ఆపేయాలని గతంలో ఉత్తర్వులిచ్చింది. అయితే 80 శాతం పూర్తయినవి కూడా ఆపేశారు.  రాజధాని అమరావతి నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. ప్రముఖ సంస్థలు పలు నిర్మాణాలు చేపట్టాయి. 24 గంటలు, 50 వేల మంది కార్మికులు అక్కడ పనిచేసేవారు. కొన్ని సంస్థలు తాము దక్కించుకున్న కాంటాక్టు నిర్మాణాలను 50 నుంచి 75 శాతం వరకు పూర్తి చేశాయి. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేయాలని ఉత్తర్వులిచ్చారు. మొత్తం రూ. 45వేల కోట్ల వరకు భవన నిర్మాణాలతోపాటుగా పలు రహదారులు చేపట్టారు. వాటన్నింటిని ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత మూడు రాజధానులుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పనులు ఆపేశారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో స్వల్పంగా పనులు ప్రారంభించారు. 


 
కాంట్రాక్టుల రివర్స్ టెండర్లు !



వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ను తమ విధానంగా ఎంచుకుంది. తెలుగుదేశం హయాంలో ఇచ్చిన టెండర్లన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అక్రమార్కుల తప్పుడు అంచనాలకు  అడ్డుకట్ట వేశారు.  ఫలితంగా రివర్స్‌​ టెండరింగ్‌ ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 5,070 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా నిలువరించగలిగామని ప్రభుత్వం ప్రకటించింది.  జాతీయ ప్రాజెక్టయిన పోలవరంతో రివర్స్‌ టెండరింగ్‌ మొదలు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు  మున్సిపల్, విద్య, వైద్య, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల్లో అమలు చేశారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి  రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1824.65 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఆదా చేయగలిగింది. ఏపీ టిడ్కోలో చేపట్టిన 12 పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా  రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా అయ్యింది. మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌టెండరింగ్‌లో రూ.811.32 కోట్లు మిగులు వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం. ఇలా అన్ని పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా భారీగా ఆదా చేశామని ప్రభుత్వం ప్రకటించింది. 



టీడీపీ హయాంలోపథకాల నిలిపివేత !


ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్న క్యాంటీన్లు,  చంద్రన్నబీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్యాదీవెన, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను నిలిపివేశారు. అయితే ప్రత్యామ్నాయ పథకాల ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ అలాంటివి జరగలేదు .