ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని, హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఎవరూ రావొద్దని బత్తిని వంశస్తులు సూచించారు. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఆస్తమా పేషెంట్లకు చేదువార్త ఇది. ప్రతి ఏడాది మృగశిర కార్తె వచ్చిందంటే చేప మందు పంపిణీ గుర్తొస్తుంది. కానీ కరోనా వ్యాప్తి తరువాత పరిస్థితులు మారిపోయాయి.
మృగశిర కార్తెలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిట
ప్రతి ఏడాది మృగశిర కార్తె (Mrigasira Karti) వచ్చిందంటే హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. ఆస్తమా రోగులకు బత్తిని వంశస్తులు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆస్తమా పేషెంట్లు చేప మందు తీసుకునేందకు ప్రతి ఏడాది హైదరాబాద్‌కు వచ్చేవారు. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది చేప మందు పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. దీంతో ఆస్తమా పేషెంట్లు చేప ప్రసాదం కోసం ఈ ఏడాది హైదరాబాద్ రావొద్దని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ (Gowri Shankar Distributes Fish Prasadam) తెలిపారు.
దశాబ్దాల సంప్రదాయానికి మూడో ఏడాది ఆటంకాలే..
దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో మూడేళ్ల కిందట తొలిసారి చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా, కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అనుమతి ఇవ్వలేదు. గత ఏడాది సైతం ప్రభుత్వం నో చెప్పడంతో ఆస్తమా పేషెంట్లకు నిరాశే ఎదురైంది. కనీసం ఈ ఏడాదైనా తమకు చేప మందు దొరుకుతుందని ఆస్తమా పేషెంట్లు భావించారు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చి చేప మందు తీసుకుందామనుకున్నారు. కానీ కరోనా నిబంధనలతో ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ వెల్లడించారు. దాంతో వరుసగా మూడో ఏడాది ఆస్తమా పేషెంట్లకు చేప మందు లభించనట్లవుతుంది.