PM Modi Hyderabad Tour Traffic Diversions: ప్రధాని రాక సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం (మే 26) ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మోదీ ఇక్కడికి రానున్నారు. అందుకని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు గురువారం అమల్లో ఉండనున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.


* లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్ తీసుకొని, మసీద్ బండ కమాన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది.


* విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసుకొని, HCU బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.


* విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, ఓఆర్ఆర్ రోడ్డు, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు.


* కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్-45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు.


* గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని, బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, HCU డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.


మోదీ పర్యటన వేళ పటిష్ఠ భద్రత


మే 26న గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ - Indian School of Business) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఈ ఏర్పాట్లు సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు  మాత్రం సోషల్ మీడియాలో కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడ పడుతున్నారు.


ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన కోసం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉండనున్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా ఖాతాలను కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడపడుతున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. అంతేకాక, విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఎస్పీజీ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాల్లో బాగుంటేనే ఆయా విద్యార్థులకు ఎంట్రీ పాసులు ఇవ్వాలని చూస్తున్నారు. ఎవరైనా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటే వారికి అనుమతించరు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.