Stadler Rail Coach Factory in Telangana: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ (Stadler Rail) సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Medha Servo Drives Private Limited), స్టాడ్లర్ రైల్ (Stadler Rail) కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ Ansgard Brockmeye, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్ లో అవగాహన ఒప్పందంపై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం మేరకు రానున్న రెండు సంవత్సరాలలో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్ లను కేవలం భారత దేశం కోసం మాత్రమే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో తమ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్ లను తయారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితం అయింది అన్నారు. కంపెనీ పెడుతున్న వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ కంపెనీకి అత్యంత ప్రాధాన్యం కలిగేదిగా మారబోతుందని అని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ Ansgard Brockmeye తెలిపారు. తమ కంపెనీ ఏసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు అందిస్తున్న సహకారంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.