పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్నా.. పేదలకు, దళితులకు, గిరిజన, బహుజన వర్గాలకు ఇళ్లు కట్టివ్వకుండా మోసం చేశారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి కనీస అవసరమై సొంత ఇంటిని అందకుండా చేసిన ద్రోహి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి, నిరుపేదలకు, దళిత, గిరిజన, బహుజన, మైనారీ వర్గాలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 నుంచి 2014 వరకూ 20 లక్షల 48 వేల 256 ఇందిరమ్మ ఇండ్లను కట్టించి వారికి అందించిందని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ బెడ్ రూమ్ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను కట్టించేలా ప్రణాళికలు రూపొందించి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అందించిందని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ లేకుండా చేశారని విమర్శించారు.


‘అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని.. మాట చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి.. చివరకు ఒక్క పేదవాడికి కూడా ఇండ్లు కట్టించి ఇవ్వలేదు. మోచేతికి బెల్లం రాసుకుని నాకమన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉంది.  8 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తే.. ఈ కేసీఆర్ మాటల మోసాలు చేస్తూ కాలం గడిపేశారు. లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఆశ చూపెట్టిన కేసీఆర్.. నిలువనీడలేకుండా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు రాకుండా హౌసింగ్ కార్పొరేషన్ ను రద్దు చేశారు. ఇందిరమ్మ ఇండ్లను ఎత్తేసి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాక.. మొత్తంగా రాష్ట్రంలోని పేద ప్రజలను ఎండకు ఎండేలా.. వానకు తడిసేలా చేసి నడిరోడ్డున నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని’ మధుయాష్కీ ఎద్దేవా చేశారు.
Also Read: Bandi Sanjay: ధాన్యం ఎట్ల కొనవో చూస్తా బిడ్డా.. ఆ ఒప్పందాలేమైనా చేసుకుంటున్నవా? డౌట్ వస్తున్నది: బండి సంజయ్


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఉమ్మడి జిల్లాల వారీగా.. ఏడాదికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టించిందో కింద పట్టిక చూస్తే అర్థమవుతుంది. 



టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి ఏడున్నర సంవత్సరాలు కాగా.. ఇన్నేళ్లలో ఎన్ని ఇండ్లను పేదలకు అందించాడొ కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అధికారిక సైట్‌లో కూడా వివరాలు లేవని, కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటివరకూ కనీసం శంఖుస్థాపన చేసిన దాఖలలు లేవన్నారు. మరికొన్ని చోట్ల శంఖుస్థాపన ఫలకాలు శిథిలదశకు చేరుకున్నా.. ఇండ్లు కట్టిన పాపాన పోలేదంటూ మధుయాష్కీ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఇప్పటివరకూ 26,31,739 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వమే ప్రకటించింది.. కానీ కేవలం 2.91 లక్షల ఇళ్లు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 
Also Read: CM KCR: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...


కేసీఆర్ పాలన చూస్తే అర్హులకు ఇళ్లు ఇచ్చే అవకాశాలే కనిపించడం లేదన్నారు. మాయమాటలతో, గారడీ చేష్టలతో పేదలకు నిలువనీడ లేకుండా చేసిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి